దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ, వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న సుమారు 74వేల మంది హిజ్రాలను అరెస్ట్ చేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ ఆర్డీఐ దరఖాస్తుదారుడికి ఇచ్చిన సమాధానం ప్రకారం గత నాలుగేళ్ల కాలంలో 73,837 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. అంటే సగటున రోజుకు 50 మందిని అరెస్ట్ చేసిందన్నమాట. రైళ్లలో ప్రయాణించే వారిని కొందరు ట్రాన్స్జెండర్లు చాలా ఇబ్బందులు పెడుతుంటారు. అందులో కొందరు డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తూ అందరి ఎదుట పరువు తీయడం లాంటివి చేస్తుటారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉంటుంది. 2015 నుంచి 2019 జనవరి వరకు సేకరించిన డేటాను రైల్వే అధికారులు ఆర్టీఐ దరఖాస్తుదారుడికి వివరించారు. ఆ లెక్కల ప్రకారం 2015లో 13,546 మందిని అరెస్ట్ చేశారు. 2016లో 19,800 మంది, 2017లో 18,526 మంది, 2018లో 20,566 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 2019 జనవరి నెలలో 1399 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.