కాంగ్రెస్‌ కి భారీ షాక్ 

కాంగ్రెస్‌ కి భారీ షాక్ 

మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్టయ్యారు. దీంతో కర్ణాటక రాజకీయం మరోసారి హీటెక్కింది. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది.  కనకపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడిచేశారు. తనను అరెస్ట్ చేయడంతో బీజేపీ మిత్రులు సక్సెస్ అయ్యారంటూ ట్వీట్‌ చేసిన శివకుమార్ కక్ష సాధింపు రాజకీయాలు తననేమీ చేయలేవని ధీమా వ్యక్తంచేశారు.

దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని, పీఎంఎల్ఏ అభియోగాల కింద ఆయనను అదుపులోనికి తీసుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్‌ను పిలిపించుకుని విచారణ జరుపుతున్నారు. నిన్న సాయంత్రం ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.

కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, కుమారస్వామి శివకుమార్‌ అరెస్టును తప్పుబట్టారు. దర్యాప్తు సంస్థలతో కలిసి బీజేపీ ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతోందని నేతలు ఆరోపించారు. కనకపూర్‌లో భాజపా కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో బెంగళూరు-మైసూర్‌ రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇవాళ రామనగర్‌ బంద్‌కు కాంగ్రెస్‌పార్టీ పిలుపునిచ్చింది.

కాంగ్రెస్‌నేత డీకే శివకుమార్‌ అరెస్టుపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. శివకుమార్‌ అరెస్టు అసంతృప్తి కలిగించిందని వ్యాఖ్యానించారు. కేసు నుంచి శివకుమార్‌ త్వరలోనే బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు.  ఏడాదిన్నర క్రితం శివకుమార్‌ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.8.59 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శివకుమార్‌. నాలుగురోజు క్రితం ఈడీ అధికారుల ఎదుట విచారణకు  హాజరయ్యారు. సోమవారం, మంగళవారం ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించి అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించారు.