పాఠాలు చెప్పే గురువునే కడతేర్చిన శిష్యుడు

పాఠాలు చెప్పే గురువునే కడతేర్చిన శిష్యుడు

తోటి విద్యార్థుల ముందు తనను అవమానించిందని ఓ మైనర్‌ విద్యార్థి స్కూల్‌ ప్రిన్సిపల్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గోవండి జిల్లాలోని శివాజీ నగర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆయేషా అస్లాం హసూయి (30) ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. దాంతోపాటు గత ఐదేళ్లుగా తన ఇంటివద్ద ట్యూషన్‌ చెప్తోంది. ఈ క్రమంలో తన వద్ద చదువుకునే ఓ పన్నెండేళ్ల విద్యార్థి.. గత సోమవారం ఆమెను రూ.2 వేలు ఇవ్వుమన్నాడు. దాంతో సదరు ప్రిన్సిపల్‌ అతన్ని తరగతి గదిలోనే కొట్టింది. దీన్ని అవమానంగా భావించిన ఆ మైనర్‌ విద్యార్థి ఆమెపై పగపెంచుకున్నాడు. ఎప్పటిలాగానే అదేరోజు సాయంత్రం ఆమె ఇంటికి ట్యూషన్‌కు వెళ్లాడు.

తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. హసూయి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హసూయి మరణించిందని పోలీసులు వెల్లడించారు. మైనర్‌ విద్యార్థిని రిమాండ్‌కు తరలించామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ప్రిన్సిపల్ వద్ద తన తల్లి రూ.2 వేలు అప్పుగా తీసుకురమ్మందని.. ఆ విషయమే ప్రిన్సిపల్‌కు చెబితే అందరి ముందు కొట్టిందని విద్యార్థి పోలీసుల విచారణలో చెప్పాడు. అవమాన భారంతోనే ఈ హత్య చేసినట్టు పేర్కొన్నాడు.