కోడెల శివప్రాదరావు అంత్యక్రియలకు పోటెత్తిన జనం

కోడెల శివప్రాదరావు అంత్యక్రియలకు పోటెత్తిన జనం
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రాదరావు అంత్యక్రియలకు టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసరావుపేటలోని హిందూ శ్మశానవాటికలో కోడెలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. నరసరావుపేట పట్టణం కోట సెంటర్‌లోని కోడెల నివాసం నుంచి అంతిమయాత్ర మరికొద్దిసేపట్లో బయలుదేరనుంది. కోడెల ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన గుంటూరు రోడ్డులోని శ్మశానవాటికలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో నరసరావుపేట చేరుకుంటున్నారు. కోడెలను కడసారి చూసేందుకు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల ప్రజలు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి ఆయన అభిమానులు కోడెల నివాసానికి చేరుకుంటున్నారు. కోడెలను చివరిసారి చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు క్యూలైన్లలో బారులుదీరారు. పెద్దఎత్తున తరలివస్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కోట సెంటర్ జనసంద్రంగా మారింది.
కోడెల అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడెల నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కోడెల శివప్రసాదరావుకు సంతాపం తెలుపుతూ నరసరావుపేట పట్టణంలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలో బంద్ పాటించనున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది.