మూడు రోజులు భారీగా ఉండబోతున్న వర్షాలు

మూడు రోజులు భారీగా ఉండబోతున్న వర్షాలు
మంగళవారం సాయంత్రం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎత్తుకి వెళ్లేకొద్దీ నైఋతి వైపునకు వంపు తిరిగి, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు మరింత చురుకుగా మారాయి. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోనూ బుధ, గురువారాలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ వివరించింది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.

రాయలసీమలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

వాగులు, వంకలు పొంగి పొర్లుతాయని, వాటిని దాటే సాహసం చేయరాదని హెచ్చరించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సూచనలు జారీ చేసింది.