Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు కీలక ఆధారాలు లభించాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గౌరీలంకేశ్ హత్య జరిగిన రోజు దుండగలు రెక్కీ నిర్వహించినట్టు సీసీటీవీలో రికార్డయింది. తెల్ల చొక్కా, నల్ల హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై రెండుసార్లు గౌరీలంకేశ్ ఇంటిముందు సంచరించారు. మధ్యాహ్నం మూడుగంటలకోసారి, రాత్రి ఏడుగంటలకోసారి దుండగులు గౌరీలంకేశ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ద్విచక్రవాహనంపై ఉన్న ఓ వ్యక్తి రాత్రి ఏడుగంటల సమయంలో ఆమె ఇంటిమీదగా ఓ సారి వెళ్లాడు. తిరిగి యూటర్న్ తీసుకుని మళ్లీ ఇంకోసారి ఇంటివైపు చూసుకుంటూ వెళ్లాడు.
ఇది జరిగిన గంట తరువాత గౌరీలంకేశ్ హత్య జరిగింది. రాత్రి 8.05 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన లంకేశ్ పై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును కర్నాటక ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటిదాకా 80మందిని అనుమానితుల్ని విచారించి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది.
గౌరీలంకేశ్ మృతదేహంలో లభ్యమయిన బుల్లెట్ల ఆధారంగా దుండగులు ఉపయోగించిన తుపాకీ మోడల్ ను అధికారులు గుర్తించారు. రెండేళ్ల క్రితం కల్బుర్గిని హత్యచేసిన ఆయుధంతోనే గౌరీలంకేశ్ హత్య కూడా జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయింది. దీంతో సిట్ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా కథనాలు రాసే గౌరీలంకేశ్ ను ఆరెస్సెస్ నేపథ్యమున్న వ్యక్తులు హత్యచేశారన్న ప్రచారం జరిగినప్పటికీ…ఆమెను మావోయిస్టులు చంపినట్టు పోలీసులు నిర్దారణకొచ్చినట్టు తెలుస్తోంది. గౌరీలంకేశ్ సోదరుడు కూడా నక్సల్స్ పైనే అనుమానం వ్యక్తంచేశారు.