లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న జర్నలిస్ట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. జమ్ముకశ్మీర్‌లో ఓ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు గాను కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… కశ్మీర్‌లో ఫ్రీలాన్సర్ ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా అనే 26 ఏళ్ల యువతి.. తన ఫేస్‌బుక్‌లో జాతి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు పోలీసులు కనుగొన్నారు.
అయితే ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్న ఈ సమయంలో…. మస్రత్ జహ్రా పోస్ట్.. శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ఉండటంతో.. ఆమెపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. యువతలో జాతి వ్యతిరేకతను రెచ్చగొట్టేలా ఆమె పెట్టిన పోస్ట్ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో ఆమెపై చట్టవ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించే చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సదరు జర్నలిస్టు.. పలు అంతర్జాతీయ వార్తా సంస్థలకు ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులల దర్యాప్తులో వెల్లడైంది.