ఏపీలో ప్రతి ఒక్కరికీ.. మూడేసి మాస్క్ లు.. మొత్తం16కోట్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ చాలా తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 405కు చేరింది. దీంతో రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కరోనావైరస్ మరింత వ్యాప్తిచెందకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వంటి ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ మూడేసి చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. హై రిస్క్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే.. రాష్ట్రంలో మూడోసారి సర్వే పూర్తి అయినట్టు అధికారులు జగన్ కు తెలిపారు. కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 45 వేల మందికి పరీక్షలు చేసేందుకు వైద్య శాఖ రెడీ అయిందని సీఎంకు అధికారులు వెల్లడించారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందన్న సీఎం జగన్.. వీలైనంత త్వరగా మాస్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి ఉన్న జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరిన ఆయన.. సోషల్ డిస్టెన్స్‌ తప్పనిసరిగా పాటించాల్సిందేనని వివరించారు. అంతేకాకుండా.. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్ ఉండాల్సిందేనని వైఎస్ జగన్ సూచించారు. ఇంకా ఎక్కడా కూడా జనం గుమి కూడకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.