కారును అతివేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాననే మనస్తాపంతో హైదరాబాద్ లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
నిన్న వేకువజామున మోహన్ అనే వ్యక్తి తన నలుగురు మిత్రులతో కలిసి పటాన్చెరు సమీపంలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకోవడానికి కారులో బయల్దేరి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మోహన్ డ్రైవింగ్ చేస్తున్న కారు కర్దనూర్ వద్ద అదుపుతప్పి బైక్ను ఢీకొంది.
దీంతో బైక్పై వెళ్తున్న సురేశ్ అనే ఫార్మా ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తాను నడుపుతున్న కారు కారణంగా వ్యక్తి దుర్మరణం పాలవడంతో మోహన్ భయాందోళనకు గురయ్యాడు. స్నేహితుల సలహా మేరకు అక్కడి నుంచి అప్పటికి అయితే తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు.
వేకువజాము కావడంతో వాళ్లు అక్కడ నుంచి తేలిగ్గా బయటపడ్డారు. అయితే.. తన కారణంగా ఓ నిండు ప్రాణం బలైందని తీవ్ర మనస్తాపానికి గురయిన మోహన్ స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో ఆ విషయాన్ని చెప్పి మనోవేదనకు గురైనట్లు సమాచారం.
జరిగిన ఘటనతో మనస్తాపానికి గురైన మోహన్ తాను నివాసం ఉంటున్న భవనం ఐదో అంతస్తు పైనుంచి కిందకి దూకాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.