జనసేన పార్టీకి సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ షాకిచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పవన్‌కు పంపించారు. కాగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సత్యనారాయణ కూడా పార్టీని వీడటం.. మరికొంత మంది నేతలు కూడా ఇదే బాటలో నడుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి. కాగా గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి సత్యనారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే.
కాగా కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు… కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఇలా నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నా జనసేన అగ్రనేతలు స్పందించకపోవడం గమనార్హం.