పేదలకి శుభవార్త చెప్పిన జగన్…వారందరికీ ఆరోగ్యశ్రీ  

Aarogya sri Scheme-good news by Jagan

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మళ్ళీ గాడిలో పెడతామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కొత్తగా 3 మెడికల్‌ కాలేజీలు, పేద రోగులకు ప్రయోజనం కల్పించడానికి 5 క్యాన్సర్ ఆస్పత్రులు, 2 కిడ్నీ ఆస్పత్రులను నిర్మిస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

ప్రాధాన్యాల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులను, 108, 104 సర్వీసులను మెరుగు పరుస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న ఆయన వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు.  పూర్తిస్థాయి సదుపాయాలతో 5 క్యాన్సర్‌ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

కడప, విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాలతో పాటు తిరుపతి ఒక్కో క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మిస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ రీసెర్చ్‌ ఆస్పత్రి, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్‌ కాలేజీలు స్థాపిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వీటికి శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు.

108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండేలా చర్యలు చేపట్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. కనీసం ఆరేళ్లకు ఒకసారి వాహనాలను మార్చాలని సూచించారు. కొత్తగా 1000 వాహనాలను కొనుగోలు చేస్తున్నామని.. ఇందుకు సంబంధించి సెప్టెంబరులో టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు.

అర్హులైన ప్రతి కుటుంబానికీ హెల్త్‌ కార్డు, క్యూఆర్‌ కోడ్‌తో కార్డుల జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను ‘ఏ ప్లస్‌’ కేటగిరీలోకి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు. వైద్యానికి ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తామని తెలిపారు.

దాని కిందకు వచ్చే జబ్బుల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నవంబర్‌ మొదటి వారం నుంచి రాష్ట్రం వెలుపల ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైల్లోని సుమారు 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.