‘అభిమన్యుడు’ రివ్యూ

Abhimanyudu Review

నటీనటులు : విశాల్‌, స‌మంత‌, అర్జున్‌, రోబో శంక‌ర్‌, ఢిల్లీ గ‌ణేశ్ త‌దిత‌రులు
మ్యూజిక్ : యువ‌న్ శంక‌ర్ రాజా
ఎడిటింగ్ : రూబెన్స్‌
డైరెక్టర్ : పి.ఎస్‌.మిత్ర‌న్‌
ప్రొడ్యూసర్ : జి.హ‌రి

హీరో విశాల్‌ మాస్ ఇమేజ్‌ నే కాకుండా వైవిధ్య‌మైన క‌థ‌లు చేస్తూ ప్రేక్షకుల్లో వైవిధ్యభరిత కధానాయకుడిగా పేరు సంపాదించాడు. కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న విశాల్‌, టాలీవుడ్‌లో కూడా మార్కెట్‌ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోనూ విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్‌. కోలీవుడ్‌ లో ఘనవిజయం సాధించిను ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ

తండ్రి అప్పులు చేస్తూ తిరగడం తీరా అప్పులవాళ్లు ఇంటికి వచ్చి అడిగితే ముఖం చాటేస్తునాడనడం అనే వాళ్ళ మాటలు కరుణాకరన్ (విశాల్) అలియాస్ కర్ణను బాగా ప్రబావితం చేస్తాయి. దీంతో పన్నెండేళ్లకే ఇంటి నుండి వెళ్ళిపోయి ఒక ఆఫీసర్ సాయంతో మిలటరీ లో జాయిన అయ్యి మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్‌గా ఎదిగి జీవితం గడుపుతుంటాడు విశాల్. అయితే విపరీతమైన కోపం ఉండే కర్ణను ఏంగర్ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ తీసుకురావాలని మిలిటరీ అధికారులు ఆదేశిస్తే. దానికోసం లతాదేవి (సమంతా) అనే సైకియాట్రిస్ట్‌ను కలుస్తాడు. ఆమె సలహాల మేరకు నెల రోజుల పాటు సొంతూరు వెళ్లి గడపాలని నిర్ణయించుకుంటాడు.

అక్కడకు వెళ్లిన తరువాత తన చెల్లెలకు పెళ్లి చేయాలసిన బాధ్యత ఇంకా తన మీద ఉందని తెలుసుకుంటాడు. తన దగ్గర పెళ్లికి కావల్సినంత డబ్బు లేకపోవడంతో ఓ ఏజెంట్ సహాయంతో ఫేక్ సర్టిఫికేట్స్‌తో తన తండ్రి పేరు మీద ఆరు లక్షల లోన్ తీసుకుంటాడు. డబ్బు అకౌంట్ లోకి వచ్చిన మరుసటి రోజునే ఆరు లక్షలతో పాటు తన అకౌంట్‌లో ముందే ఉన్న మరో నాలుగు లక్షలు మొత్తం పది లక్షల రూపాయలు మాయమైపోతాయి. ఇలా డబ్బు పోగొట్టుకుంది తను ఒక్కడు మాత్రమే కాదని చాలా మంది అమాయకులు ఇలానే నష్టపోయారని తెలుసుకుంటాడు. దీనంతటికీ కారణం ఎవరు ? ఎందుకు చేస్తున్నారు ? పోయిన తన డబ్బు తిరిగి సాధించాడా ? అనేదే ఈ సినిమా.

విశ్లేషణ:

ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీ థింగ్ అనే కాన్సెప్ట్ మీద రాసుకున్న కదా ఇది. షాపింగ్ మాల్స్‌లో కూపన్స్ ఫిల్ చేయండి మీకు గిఫ్ట్ ఇస్తామంటూ బలవంతంగా మన ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. మనం కూడా ఫ్రీగా గిఫ్ట్ వస్తుంది కదా అని మన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసేస్తాం. దాన్ని కాస్త వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వాటితో… ఎవ‌రు, ఎన్నెన్ని మోసాలు… దారుణాలు చేయ‌గ‌ల‌రో – వెండి తెర‌పై చూపించి భ‌య‌పెట్టిన సినిమా ‘అభిమ‌న్యుడు’. సినిమా చూసినంత సేపు ‘అభిమ‌న్యుడు’ విశాల్ ఒక్కడే కాదు మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌డూ అనే ఫీలింగ్ నిజంగా భయపెట్టింది. ఇన్ఫర్మేషన్‌ను కరెక్ట్‌గా వాడుకొని మన కారణంగా వాడు కోట్లు సంపాదించుకుంటున్నాడు.

కాల్ సెంటర్స్, బ్యాంక్స్ నుండి కాల్ చేసి మీకు ఆ లోన్ ఇస్తాం… ఈ లోనే ఇస్తాం… తీసుకోండి అంటూ తెగ బ్రైన్ తింటారు. అసలు వాళ్లకి మన ఫోన్ నెంబర్స్ ఎలా వెళ్తున్నాయని ఒక్కసారైనా సీరియస్‌గా ఆలోచించామా..? లేదు. ఏదో ఫోన్ వచ్చింది ఆన్సర్ చేశాం అన్నట్లు వదిలేస్తాం. కానీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి మన డేటాను వాళ్ల దగ్గర పెట్టుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్‌ను సరిగ్గా ఉపయోగించడం తెలిసినవాడికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు ఆయుధం… దీన్నే ఒక చిత్రంగా ‘అభిమన్యుడు’ రూపంలో మలిచారు దర్శకుడు మిత్రన్.

ఇది మ‌న కథ‌. అంటే మ‌న‌కు ఎదుర‌య్యేదో, మ‌న స్నేహితుల‌కు ఎదురయ్యేదో, లేదంటే పేప‌ర్లో, టీవీలో మనం రొజూ చూసేదో అయిన సైబర్ క్రైమ్ స‌మ‌స్య‌ని క‌థ‌గా రాసుకున్నాడు. అందుకే క‌థ‌లో ప్రేక్ష‌కుడు లీన‌మైపోతాడు. దర్శకుడు అనుకున్న పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేది. డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో కళ్లకు కట్టిచూపించారు. మ‌న చేతిలోని స్మార్ట్‌ఫోనే మ‌న జీవితాన్ని మ‌రొక‌డి చేతుల్లో ఎలా పెడుతుందో… టెక్నాలజీ యుగంలో మనం ఎంత ప్రమాదపు అంచున ఉన్నమో అలర్ట్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్‌ను అందించారు దర్శకుడు. విజ‌య్ మాల్యా, డిజిట‌ల్ ఇండియా లాంటి ఇష్యూల్ని వాడుకున్నాడు. వీటికి అందరు ఈజీగా కనెక్ట్ అయిపోతారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక నటన విషయానికి వస్తే విశాల్ త‌న‌కు త‌గిన పాత్ర పోషించాడు. ఎక్క‌డా అన‌వ‌స‌ర హీరోయిజం చూపించ‌లేదు. కానీ స‌మంతే అవ‌స‌రానికి మించి న‌వ్వుతూ క‌నిపించింది. అర్జున్ ఈ క‌థ‌కు ప్రాణం పోశాడు. చాలా స్టైలీష్‌గా ఉన్నాడు. విశాల్ పోషించిన క‌రుణ పాత్ర కంటే వైట్ డెవిల్ పాత్రే ఎక్కువ‌గా గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. టెక్నాలజీ, హ్యాకింగ్, వంటి విషయాలు అందరికీ అర్ధమయ్యే అవకాశం లేదు కాబట్టి బి,సి సెంటర్స్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమే. యువన్‌ శంకర్‌ రాజా థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్‌ మ్యూజిక్‌ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్‌ సీ విలియమ్స్‌ తన కెమెరా వర్క్‌తో సినిమా మూడ్‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌డూ ఒక్కో ‘అభిమ‌న్యుడే’
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75 / 5