Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏసీబీ మహిళా ఏఎస్పీతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయిన కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఏఏస్పీ భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం మల్లికార్జున్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. సీఐ తన భార్యను లొంగదీసుకున్నాడని ఏఎస్పీ భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ అది నిజం కానట్టు తెలుస్తోంది. కేపీహెచ్ బీ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఆమె తన ఇష్టపూర్వకంగానే సీఐతో ఉన్నట్టు చెప్పిందని సమాచారం. అటు మల్లికార్జున్ రెడ్డి కూడా ఉన్నతాధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. ఆమెను తాను వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని, విడాకులు వచ్చిన తర్వాత పెళ్లిచేసుకుంటామని మల్లికార్జున్ రెడ్డి చెప్పినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. అసలు ఏఎస్పీకి సీఐకి మధ్య పరిచయం ఎప్పుడు ఏర్పడిందన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మూడేళ్ల క్రితం పెను సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు దర్యాప్తు బాధ్యతల సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టు తెలుస్తోంది. భర్తతో కలిసి ఉండలేనని ఏఎస్పీ, భార్యతో సఖ్యంగా లేనని సీఐ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లికూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ తతంగం అప్పట్లోనే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇన్ స్పెక్టర్ గా ఉన్న మల్లికార్జున్ రెడ్డిని ఏసీబీ నుంచి బదిలీచేశారు. అయినప్పటికీ వారి మధ్య సాన్నిహిత్యం తగ్గలేదని తెలుస్తోంది. 2010లో ఏఎస్పీకి, సురేందర్ రెడ్డికి వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం సురేందర్ రెడ్డి విషయంలోనే వారికి మనస్పర్ధలు వచ్చినట్టు, ఈ విషయమై సురేందర్ రెడ్డి ఆమెను తీవ్రంగా హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ 15 రోజుల క్రితం భార్య సెల్ లో మెసేజ్ లు చూసిన సురేందర్ రెడ్డికి అనుమానం వచ్చింది.వారి మధ్య పాత సంబంధం కొనసాగుతోందన్న నిర్ధారణకు వచ్చి వారి కదలికలపై నిఘా ఉంచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
అటు వివాదం అనంతరం మల్లికార్జున్ రెడ్డి వివరణ పేరుతో వాట్సాప్ లో ఒక సందేశం వైరల్ అవుతోంది. మాది వివాహేతర సంబంధం కాదు. ఏఎస్పీతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకుంది. విడాకులు మంజూరయిన వెంటనే వివాహం చేసుకుందామనుకున్నాం. ఈ విషయం ఏఎస్పీ భర్తకు కూడా చెప్పాం. ఆదివారం రాత్రి ఏఎస్పీని ఇంటివద్ద డ్రాప్ చేసేందుకు వెళ్లాను. దీనిపై త్వరలోనే మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆ వాట్సప్ సందేశంలో మల్లికార్జున్ రెడ్డి వివరణ ఇచ్చినట్టు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.