కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు లాక్డౌన్ కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లో రాత్రి సమయంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో అర్ధరాత్రి వేళల్లో వీరంగం సృష్టిస్తున్నారు. ఇలాగే మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎన్టీఆర్ గార్డెన్ వద్ద సోమవారం రాత్రి కారుతో బీభత్సం సృష్టించారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
కరోనా మహమ్మారి దేశమంతా వ్యాపిస్తున్న తరుణంలో దేశవ్యాపంగా లాక్ డౌన్, కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా పోలీసులు రోడ్లపైకి వాహనాలను అనుమతించడం లేదు. కానీ సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన యువకుడు హిమయత్‌నగర్ వైపు నుంచి TS 09 EA 990 నంబర్ గల కారులో ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలడంతో కారును తనిఖీ చేయగా మద్యం సీసాలు బయటపడ్డాయి. కారును వెంటనే అక్కడి నుంచి తొలగించి సహాయచర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఇతర వాహనాలను అనుమతించలేదు.