మలయాళ సినీ ఇండస్ట్రీని కుదుపు కుదిపేసిన అంశం భావన కిడ్నాప్. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భావన కిడ్నాప్ వ్యవహారంలో ప్రముఖ నటుడు దిలీప్ ఉన్నట్లుగా పోలీసుల ఎంక్వౌరీలో వెళ్లడి అయిన విషయం తెల్సిందే. మలయాళ సినిమా పరిశ్రమలో పలువురు కూడా దిలీప్‌ను బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ వారు దిలీప్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన్ను సినిమాల్లో నటింపజేయవద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత దిలీప్ పలు సార్లు జైలుకు వెళ్లడంతో పాటు, కేసును ఎదుర్కొన్నాడు. దిలీప్ కేసు విచారణలో పలు కీలక సంఘటనలు జరిగాయి.
ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న దిలీప్‌ను మళ్లీ మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్(అమ్మ)లోకి తీసుకోవడం వివాదాస్పదం అవుతుంది. పలు మహిళ సంఘాల వారు మరియు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు కూడా ఈ విషయమై అమ్మపై ఆగ్రహంతో ఉన్నారు. లైంగిక వేదింపుల కేసులో నిందితుడిగా ఉండి బెయిల్‌పై ఉన్న వ్యక్తికి మళ్లీ ఎలా సభ్యత్వం ఇస్తారని, ఈ విషయంలో సినిమా పెద్దలు ఎలా ఒప్పుకుంటారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దిలీప్‌కు సభ్యత్వం ఇవ్వడం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరి ఈ విషయమై అసోషియేషన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.