ఇప్పుడైతే అటు హీరోగా నిలదొక్కుకోలేక, ఇటు కమెడియన్ గా నవ్వులు పూయించలేక సునీల్ తెగ ఇబ్బందిపడిపోతున్నాడు గానీ, ఒక దశాబ్దం క్రితం చూసుకుంటే, సునీల్ ఒక మోస్ట్ వాంటెడ్ కమెడియన్. అప్పట్లో, ఈ సినిమాలో సునీల్ ఉన్నాడా అని చూసుకొని సినిమా థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఏ ముహూర్తాన రాజమౌళి మగధీర తో తన మీద పెరిగిన అంచనాలని కాస్త క్రిందకి తీసుకొద్దాం అనుకుంటూ, కమెడియన్ గా భీభత్సమైన ఫామ్ లో ఉన్న సునీల్ ని పెట్టి మర్యాద రామన్న తీసాడో గానీ, ఆ సినిమా విజయంతో సునీల్ మెదడులో నేను సక్సెస్ఫుల్ హీరో అనే పురుగుని ఎక్కించాడు. రాజమౌళి ఈగని హీరోగా పెట్టి కూడా సినిమాని హిట్ చేయగలడని, అది రాజమౌళి విజయం మాత్రమే అని, ఆ విజయ మైకం లో ఉన్న సునీల్ గుర్తించలేకపోయాడో గానీ, దానికి తగిన మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నాడు. దానికి తోడు, సునీల్ తన ప్రాణ స్నేహితుడుగా చెప్పుకొనే త్రివిక్రమ్ కూడా ఇక హీరోగా కంటిన్యూ అవ్వు అని అన్నాడే కానీ సునీల్ ని పెట్టి హీరోగా కనీసం ఒక్కటంటే ఒక్కటి చిన్న సినిమా కూడా చేయలేదు.
తరువాత హీరోగా చేసిన సినిమాల్లో ఒకటి, అరా విజయం సాధించాయే గానీ, మిగతావన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా బోల్తా పడ్డాయి. అయినా, హీరో స్థానం నుండి దిగలేక, పొరుగు భాషల్లో విజయవంతం అయిన సినిమాలని రీమేక్ చేస్తూ అయిన హిట్ కొడదామని చూసినా, విజయం కోసం చూస్తూ, చూస్తూ మొహం వాచింది కానీ, హీరో గా కన్పించడం కోసం పెంచిన నాలుగు పలకల దేహం కూడా ఏ విధంగా ఉపయోగపడలేదు. పోనీ, తన కామెడీతో అయినా కాస్త నవ్వించాడా అంటే అదీ లేదు.ఇక ఈ తలనొప్పులు ఇక పడలేను అనుకున్నాడో, హీరో మెట్టు దిగక తప్పేది లేదని తెలుసుకున్నాడో ఏమో, కమెడియన్ గా సిల్లీ ఫెలోస్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో నవ్వులు పంచడానికి తెగ ఇదై పోతున్న నవ్వుల హీరో అల్లరి నరేష్ తో స్క్రీన్ పంచుకొని హిట్ కొట్టాలని చూసినా, ఆ ఇద్దరు చేసిన కామెడీ కూడా వర్కౌట్ అవ్వక, బాక్స్ ఆఫీస్ వద్ద మరో ప్లాఫ్ ని నమోదు చేశారు ఇద్దరూ కలిసి. కనీసం కమెడియన్ గా అయినా నన్ను నిలబెట్టు అని తన స్నేహితుడు త్రివిక్రమ్ దగ్గర మొరపెట్టుకున్నాడో ఏమో, త్రివిక్రమ్ తన అరవింద సమేత సినిమాలో ఇచ్చిన పాత్ర తో మరోసారి నవ్వులపాలయ్యాడు. ఆ సినిమాలో సునీల్ పాత్ర, కమెడియన్ కి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువలా ఉంది. నీ తలనొప్పి నావల్ల కాదురా అనుకొని, ఏమి పాత్ర ఇవ్వాలో తెలియక అతడు సినిమాలో సునీల్ చేసిన పాత్రనే మళ్ళీ ఇచ్చేసి, చేతులు దులుపుకున్నట్టు ఉంది త్రివిక్రమ్ యవ్వారం చూస్తుంటే. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ కి పేరు రాకపోగా, ఇలా అయిపోయాడేంటి అని ప్రేక్షకులు జాలిపడేలా చేసింది అరవింద సమేత లో సునీల్ పాత్రని చూసిన ప్రేక్షక జనం.
ఇక అసలు విషయానికి వస్తే, కమెడియన్ గా తనని అగ్రస్థానాన నిలిపిన శ్రీను వైట్ల తో మళ్ళీ జతకట్టాడు సునీల్. వరుస ప్లాపుల ద్వారా అథ:పాతాళానికి చేరుకొని, మళ్ళీ తేరుకొని శ్రీను వైట్ల చేస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ సినిమాలో సునీల్ రవితేజ పక్కన అసిస్టెంట్ గా నటిస్తాడంట. అంతేకాకుండా, సునీల్ పాత్ర సినిమా ప్రారంభం నుండి చివరి దాకా ఉంటుందని, ఖచ్చితంగా నవ్వులు పంచుతూ, అసలైన కమెడియన్ సునీల్ ని మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేస్తుందని శ్రీను వైట్ల నమ్మకంగా చెప్పాడు. చూద్దాం…ఇంకెన్ని రోజులులే. ఈ నవంబర్ 14 నే చిత్రం విడుదలవుతుంది. ఈసారైనా సునీల్ కమెడియన్ గా నవ్వులు పూయిస్తాడని ఆశిస్తూ, సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.