ప్రముఖ సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో వైకాపాలో పనిచేసిన ఆదిశేషగిరిరావు ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్ తదితరులు ఆదిశేషగిరిరావు నివాసానికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ సందర్బంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన సమస్యల్లో ఉందని అన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. సీఎం చంద్రబాబు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. మరో ఐదు సంవత్సరాలు చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా పనిచేయాలని కోరుకున్నారు. అన్నయ్య కృష్ణ ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన అభిమానులు టీడీపీ విజయానికి కృషి చేయాలని ఆదిశేషగిరి రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హక్కుల సాధనకు ఎవరినైనా ఎదిరిస్తామని, గత ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అన్నీ ఇస్తామని చెప్పిన బీజేపీ ఆ తర్వాత నమ్మకద్రోహానికి పాల్పడిందని దుయ్యబట్టారు. వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడిందంటున్న మోడీనే అవినీతి ట్రాప్‌లో పడ్డారు అని చంద్రబాబు విమర్శించారు. రాబోయే రెండు నెలల్లో కృష్ణ-మహేశ్‌బాబు అభిమానులు గట్టిగా పనిచేసి అభిమానుల సత్తా ఏమిటో చూపించాలని కోరారు.