మాజీ ఎంపీ భార్యను…దారుణంగా చంపిన కొడుకు…దాని కోసమేనా ?

Man arrest

బంధాల కంటే డబ్బే ఎక్కువైపోతోంది నేటి సమాజంలో. ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులనే కడతేర్చే అభినవ రాక్షసులు మన మధ్యనే తిరుగుతున్నారు. డబ్బు కోసం కన్నవారినే కసిదీరా చంపుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా చెన్నైలో ఇలాంటి దారుణమే జరిగింది. ఆస్తి పంచాలంటూ కన్నతల్లిని దారుణంగా హత్యచేశాడు ఓ కిరాతకుడు. పూర్తి వివరాల్లోకి వెళితే అన్నాడీఎంకే మాజీ ఎంపీ కులందైవేలు, భార్య రత్నంకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కులందైవేలు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. ఆయన కుమార్తె డాక్టర్ సుధ (37) భర్తతో కలసి తిరుప్పూరులో నివసిస్తోంది. ఇక కుమారుడు ప్రవీణ్ (35) విదేశాల్లో చదువు కోసం వెళ్లడంతో చెన్నైలోని బీసెంట్ నగర్‌లో రత్నం ఒంటరిగా నివసిస్తోంది. ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రవీణ్ ఓ యువతిని వెంటబెట్టుకొని ఇంటికి వెళ్లాడు. ఆ యువతి విషయంలో తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగినట్టు చెబుతున్నారు. దాంతో తనకు ఆస్తి పంచింతే ఇంటి నుంచి వెళ్లిపోతానని అతను తల్లితో చెప్పాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రత్నం తన కూతురుకి ఫోన్‌చేసి విషయం చెప్పింది. ఆస్తి పంచకపోతే చంపేస్తానని ప్రవీణ్ బెదిరిస్తున్నాడని తెలిపింది. కంగారుపడిన సుధ బీసెంట్‌ నగర్‌లో ఉండే బంధువులకు ఫోన్‌చేసిన తన తల్లికి ధైర్యం చెప్పాల్సిందిగా కోరింది. ఒకసారి ఇంటికి వెళ్లి చూసిరమ్మని చెప్పింది. వాళ్లు రత్నం ఇంటికి వెళ్లి చూసేసరికి తలుపు మూసిఉంది. గుమ్మం దగ్గర రక్తపు మరకలు కనిపించడంతో భయపడి పోలీసులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. పోలీసులు బీసెంట్‌నగర్‌కు వెళ్లి రత్నం ఇంటి తలుపులను బద్ధలుకొట్టారు. లోపల దృశ్యాలను చూసి వాళ్లు షాక్ తిన్నారు. నోట్టో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు ప్లాస్టిక్ వైర్‌తో కట్టేసి ఉన్న రత్నం కనిపించింది. ఆమె రొమ్ము భాగంలో కత్తి పోట్లు ఉన్నాయి. రక్తపు మడుగులో అచేతనంగా పడిఉండడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆమె మాజీ ఎంపీ భార్య కావడంతో స్థానికంగా ఈ హత్య తీవ్ర కలకలం రేపింది.