ఘోర విమాన ప్రమాదం సంభవించి ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12 మంది మృతి చెందిన సంఘటన మయన్మార్లో చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో సైనిక విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మఠం శంకుస్థాపన చేసేందుకు విమానం పై ఓ ఎల్విన్ పట్టణానికి వెళ్తోంది.
దేశ రాజధాని న్యాపిడా నుంచి గురువారం బయల్దేరిన కొద్దిసేపటికి కుప్పకూలింది. విమానంలో ఆరుగురి మిలిటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. ప్రమాదంలో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే వారిలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు.
అయితే ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలతో బయటపడినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. 400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన అనంతరం వాతావరణం సహకరించక సిగ్నల్స్ అందలేదు. దీంతో విమానం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో సైనిక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే.