Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం నేత దినకరన్ ఘనవిజయం తర్వాత తమిళరాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఉప ఎన్నికలో ఘోర ఓటమి నేపథ్యంలో అన్నాడీఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు నేతలను పార్టీపదవుల నుంచి తొలగించింది.
వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్ పార్థిబన్లను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వీరంతా దినకరన్ కు అనుకూలంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఆర్కేనగర్ లో ఊహించనివిధంగా ఓటమి పాలవడంతో అన్నాడీఎంకె ఉన్నతస్థాయి నాయకులు పార్టీ ప్రధానకార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. జయలలితకు కంచుకోటగా ఉన్న ఆర్కేనగర్ లో పార్టీ ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చసాగింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికలో ఓడిపోవడంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఈపీఎస్, ఓపీఎస్ నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఆరుగురు నేతలను పార్టీనుంచి తొలగించారు. మరోవైపు దినకరన్ రేపు బెంగళూరు వెళ్లి చిన్నమ్మను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలుపు తర్వాత ఆయన అత్యంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. మూడు నెలల్లో ఈపీఎస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యంచెబుతున్నారు. ఓపీఎస్, ఈపీఎస్ వర్గీయుల్లో కొందరు దినకరన్ వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారని..అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. .