Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో దేవాలయాలను దర్శించడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. హిందువుల ఓట్ల కోసమే రాహుల్ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారని, ఆయన అసలు హిందువే కాదని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ విమర్శల్ని రాహుల్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఇవాళ కూడా రాహుల్ గుజరాత్ లోని సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికలకు ముందూ తరువాతా రాహుల్ ఇలా ఆలయాలకు వెళ్లడంపై మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.
రాహుల్ జీ మీకు గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా..? మసీదులు, ముస్లిం ప్రజలు కనపడడం లేదా… వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఓవైసీ రాహుల్ ను ప్రశ్నించారు. కేవలం మత రాజకీయాలతోనే పార్టీలు లబ్దిపొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా ముస్లిం ప్రజల హామీల గురించి ప్రస్తావించలేదని, ఇలా ఎన్నికల్లో గెలవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ కూడా అసదుద్దీన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. పార్టీకో రంగు పులుముకుని మత రాజకీయాలు చేస్తున్నాయని, అవి తల్చుకుంటే ఏమీచేయలేవని, అదే తాము తలచుకుంటే ఎంతకైనా తెగిస్తామని, ఆ దెబ్బకి మోడీ, కాంగ్రెస్ ఇలా ఏవీ పనికి రాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు.