విమానం ట్రిప్ క్యాన్సిల్ చేసి వెళ్లిపోయిన పైల‌ట్

Air India pilot leaves flight

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ముందే బుక్ చేసుకున్న‌దాని ప్ర‌కారం ఏదైనా ఓ వాహ‌నంలో ప్ర‌యాణించ‌డానికి ప్ర‌యాణికులు సిద్ధంగా ఉండ‌గా…స‌డ‌న్ గా ఆ వాహ‌న డ్రైవ‌ర్..నా డ్యూటీ టైం అయిపోయింది…అని వెళ్లిపోతే ఆ ప్ర‌యాణికుల ప‌రిస్థితి ఎలా ఉంటుంది…అంతా గంద‌ర‌గోళంగా మారుతుంది క‌దా…ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌యింది విమాన ప్ర‌యాణికుల‌కు…నిజానికి నా డ్యూటీ టైం అయిపోయింది వెళ్తున్నాన‌నే వ్యాఖ్య‌లు సాధారంగా డ్రైవర్లు చేయ‌రు. ప్ర‌యాణికుల‌ను గమ్య‌స్థానాల‌కు చేర్చిన త‌రువాతే…వారు డ్యూటీ ముగిస్తారు. కానీ ప్ర‌భుత్వ రంగ ఎయిరిండియా అనుబంధ అల‌య‌న్స్ ఎయిర్ విమానం పైలెట్ మాత్రం త‌న డ్యూటీ ముగిసింద‌ని విమానాన్ని వ‌దిలేసి పోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే అలియ‌న్స్ ఎయిర్ కు చెందిన ఓ విమానం గురువారం రాత్రి జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే త‌న డ్యూటీ స‌య‌యం ముగియ‌డంతో తాను విమానం న‌డ‌ప‌లేన‌ని పైలెట్ చెప్పాడు.
40 మంది విమాన ప్ర‌యాణికులు జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎదురుచూస్తుండ‌గా అత‌ను ఇలా చెప్ప‌డంతో తీవ్ర గంద‌ర‌గోళం తలెత్తింది. దీంతో త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగిన ఎయిర్ లైన్స్ అధికారులు ప్ర‌యాణికుల‌కు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్ర‌యాణికుల‌ను సంప్ర‌దించ‌గా వారిలో కొంద‌రు రోడ్డు మార్గంలో బ‌స్సు ద్వారా జైపూర్ వెళ్లేందుకు అంగీక‌రించారు. అలా వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వాళ్ల‌కు హోటల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఈ ఉద‌యం మరో విమానంలో ఢిల్లీకి పంపించారు. షెడ్యూల్ ప్ర‌కారం విమానం చివ‌రి ట్రిప్ జైపూర్ నుంచి ఢిల్లీకి ప్ర‌యాణించాల్సి ఉంది. అయితే ఢిల్లీ నుంచి జైపూర్ వ‌చ్చేట‌ప్ప‌టికే బాగా ఆల‌స్య‌మ‌యింది. డీజీసీఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం పైల‌ట్ ఓవ‌ర్ టైం చేయకూడ‌దు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా పైల‌ట్ డ్యూటీ టైం ను పొడిగించ‌రు. అందువ‌ల్లే తాను అల‌సిపోయాన‌ని, ఇక విమానం న‌డ‌ప‌లేన‌ని చెబుతూ పైల‌ట్ వెళ్లిపోయాడ‌ని జైపూర్ విమానాశ్ర‌యం డైరెక్ట‌ర్ జేఎస్ బ‌ల్ హ‌రా తెలిపారు.