ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్, ఒడిశాతీరాల్లో ఇది కేంద్రీకృతమై ఉన్నది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, ఇది ఎత్తునకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారు లు వెల్లడించారు. ఇది మరింత తీవ్రంగా మారి వచ్చే 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నదని తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంలో విలీనమైందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముందని తెలిపారు. కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని వివరించారు. కాగా గత 24 గంటలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తాజా వర్షాలతో భూమి పదును కావడంతో పలు ప్రాంతాల్లో రైతన్నలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే సాగుకు మేలు జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు.