‘ఆర్ఆర్ఆర్’ కీలక పాత్రలో అజయ్ దేవగణ్

'ఆర్ఆర్ఆర్' కీలక పాత్రలో అజయ్ దేవగణ్

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కీలక అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఎపిసోడ్ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ పాత్ర కనిపించే కీలక ఘట్టం చిత్రీకరణ మంగళవారమే ఆరంభమైంది. ఈ సినిమాలో అజయ్ నటిస్తున్నట్లు పది నెలల కిందటే ప్రకటించినప్పటికీ.. ఆయన ఎప్పుడు షూటింగ్‌కు వస్తున్నది ఎప్పుడూ వెల్లడించలేదు.

కొందరేమో ఆల్రెడీ అజయ్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వార్తలు పుట్టించేశారు. ఐతే ఆయన తొలిసారి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణకు హాజరైంది మంగళవారమే. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు రాజమౌళితో అజయ్ చేతులు కలుపుతున్న ఫొటో ఒకటి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. అందులో అజయ్ టీషర్టులో మామూలుగానే కనిపిస్తున్నాడు. ఆయనింకా మేకప్ వేసుకోలేదు.

మరి సినిమాలో అజయ్ గెటప్ ఎలా ఉంటుందో.. ఆయన్ని, తన పాత్రను రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. సినిమాలో అజయ్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు అత్యంత కీలకమని.. అవి గూస్ బంప్స్ ఇస్తాయని అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లకు గురువుగా అజయ్ పాత్ర కనిపిస్తుందని అంటుున్నారు. ఈ ముగ్గురి కలయికలో రోమాంఛితమైన యాక్షన్ ఘట్టాలు ఉంటాయని చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత మేజర్ యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణకు రాజమౌళి సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఈ సన్నివేశాలు ఎలా రూపుదిద్దుకుంటాయో చూడాలి. ముందు అనుకున్నట్లు జులై 30న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాదని తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం దసరా కానుకగా అక్టోబరులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.