తొలి తెలుగు పండుగ. చైత్రమాసంలోని మొదటి రోజును ఉగాది అని.. సంవత్సరాది అని పిలుస్తుంటారు. యుగం అంటే యోగం. సహజంగా ఒక మనిషి జీవనం కాలంతో ముడిపడి ఉండటమే యోగం అంటారు. అలాంటి యోగానికి తొలి పండుగ ఉగాది ఎలా అయింది?. అందుకు గల కారణమేంటి? అసలు ఉగాది పండుగ గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి.? వంటి విషయాలు వాటి వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. తెలుగు వారు ప్రత్యేకంగా జరుపుకొనే పండుగ ఉగాది. ఉగాది రోజు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమాల్లో ఉగాది పచ్చడి.. పంచాంగ శ్రవణాలు ప్రముఖంగా ఉంటాయి. ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేయడం వెనుక అర్థం ఏమిటంటే.. జీవితాల్లో సుఖ సంతోషాలు.. కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలని తెలిపేందుకు నిదర్శనంగా చెప్తారు. అంటే ఈ ఆరు రుచులలో తీపి- సంతోషానికి, చేదు- బాధకి, కారం- కోపానికి, ఉప్పు- భయానికి, పులుపు- చిరాకుకు, వగరు- ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు.
అదేవిధంగా జీవితం అన్నిరుచుల కలయికగా పేర్కొనడానికి ఉగాది పచ్చడి ప్రతిబింబిస్తుంది అని అందరి విశ్వాసం. చాంద్రమానం ప్రకారం.. చైత్రంతో ప్రారంభమై.. పాల్గునంతో పూర్తయ్యే సంవత్సరానికి మొదలు ఈ రోజు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఉగమ్ అంటే నక్షత్ర గమనం అని అర్థం. దాని ప్రకారం చూసుకుంటే.. ఏడాదిని యుగంగాను.. దాని తొలి రోజును ఉగాదిగానూ వ్యవహరిస్తారు. అదే విధంగా రెండు ఆయనాలు ఉన్న సంవత్సరాన్ని యుగం అంటారు. అలాంటి తొలిరోజున యుగాది.. అని.. దాన్నే కల్వాదిగా కూడా కొన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ తిథిరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని.. చెప్తుంటారు.అంతేకాకుండా… వసంత ఋతువులలో తొలితనం.. శిశిరంలో చివరి లక్షణం ప్రకృతిలో ప్రత్యేకమైన గమనం. ఈ రెండింటి మద్యలోని ఒక ఏడాది కాలాన్ని లెక్కగట్టడం అనేది చక్కని ప్రాకృతిక సమన్వయంగా చెప్తుంటారు. పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని బలమైన నమ్మకం. యుగానికి ఆది యుగాది అయితే… వాడుకలో అదే ఉగాదిగా మారిందని అంటారు. ఈ రోజుతోనే వసంతరుతువు మొదలవుతుంది. ఉగాది పుట్టుక వెనుక మరో ఆసక్తికరమైన కారణం ఉందని పురాణ కథ ద్వారా తెలుస్తోంది. విష్ణుమూర్తి నాభిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. అయితే సృష్టి బాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతోపాటు నిత్యం ఉండమని విష్ణువును కోరుతాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టు ఉన్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇస్తాడు. ఇదే మొదటి దేవుని విగ్రహం అనీ అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేసిన బ్రహ్మ… ఆ తర్వాత దాన్ని సూర్యుని కోరిక మేరకు అతడికిచ్చాడు. అలా సూర్యుడు తన కొడుకైన మనువుకూ.. మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికీ ఇచ్చారు. అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడి కోరికపై రాముడు ఆ విగ్రహాన్ని ఇస్తాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దారిని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడి పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహం శ్రీరంగనాథస్వామి అని చెప్తారు. ఆ సంఘటన కూడా ఉగాదినాడే సంభవించింది అంటారు. కాగా ఈ ఉగాదిని మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, సింధీ ప్రజలు చేసుకుంటారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా అని, మణిపూర్ లో సాజీబీ చెరోవా అనీ, సింధీ ప్రజలు చాంద్ అని పిలుస్తారు. కర్ణాటక లో ఉగాది పచ్చడిని బేవు బెల్లా అని అంటారు. ఇంతటి గొప్పతనాన్ని మనిషికి అందించే ఉగాది పండుగ అందరికీ ఆనందదాయకంగా చెప్పవచ్చు. ఈ ఏడాది వచ్చే ఉగాది పేరు శార్వరీ నామ సంవత్సరం. ఈ ఏడాది ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ..