‘గ్యాంగ్ లీడర్’, ‘వాల్మీకి’ రెండు సినిమాలూ పోటీ పడితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ముందు రావడం వల్ల ‘గ్యాంగ్ లీడర్’ నష్టపోయింది. లేటుగా రావడం వల్ల ‘వాల్మీకి’ లాభ పడింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘గ్యాంగ్ లీడర్’ వీకెండ్ తర్వాత పత్తా లేకుండా పోవడం ‘వాల్మీకి’కి బాగా కలిసొచ్చింది. అడ్వాంటేజీని పూర్తిగా ఉపయోగించుకుని సోలో బ్యాటింగ్‌తో ‘వాల్మీకి’ ఇరగదీసింది.
వీకెండ్ తర్వాత చక్కగా సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. సినిమా కూడా దానికది బాగానే నిలబడింది. ఇక తర్వాతి వారంలో కొత్త సినిమాలేవీ లేకపోవడం ‘వాల్మీకి’కి బాగా కలిసొస్తోంది. రెండో వీకెండ్లో ఇదే బాక్సాఫీస్ లీడర్‌గా నిలుస్తోంది. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ పుణ్యమే.
‘సైరా’పై భారీ అంచనాలుండటంతో ముందు వారంలో ఎవ్వరూ సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసించట్లేదు. ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ విడుదల కావట్లేదు. ఇది ‘వాల్మీకి’కి భలేగా కలిసొస్తోంది. వీక్ డేస్‌లో కూడా బాగానే నిలబడ్డ ‘వాల్మీకి’.. రెండో వీకెండ్ వచ్చేసరికి హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యే అవకాశముంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు రూ.20 కోట్ల దాకా షేర్ రాబట్టింది.
రెండో వీకెండ్లో జోరు చూపిస్తే బ్రేక్ ఈవెన్ కావడమే కాదు.. బయ్యర్లకు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘వాల్మీకి’ రూ.25 కోట్ల మార్కును అందుకుంటే బయ్యర్లు సేఫ్ అయినట్లే. పరిస్థితి చూస్తుంటే నిర్మాతలు, బయ్యర్లు ఫుల్ హ్యాపీ అయ్యే అవకాాశాలు కనిపిస్తున్నాయి.