Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి… 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. కానీ ఆయన్ని ఓ రాజకీయ నేతగా, వైసీపీ నాయకుడిగా గుర్తించే వారి కన్నా రామ్ కీ రామిరెడ్డి అనే బిజినెస్ మ్యాన్ గానే ఎక్కువ మంది గుర్తు పడతారు. అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికలు అయ్యాక రామిరెడ్డి రాజకీయాల గురించి పట్టించుకుంది లేదు. కనీసం రాజకీయ ప్రకటనలు కూడా చేసింది లేదు.
ఇక ఈ మధ్యే రామిరెడ్డి తమ్ముడు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అన్నయ్యతో తన విభేదాల గురించి మాట్లాడారు. జగన్ పార్టీ పెట్టిన టైం లో ఆయనతో కలిస్తే కాంగ్రెస్ తన వ్యాపారాల్ని కూడా టార్గెట్ చేసి కేసులు పెట్టే అవకాశం వుందన్న అన్న మాటల్ని తాను పట్టించుకోలేదని ఆర్కే చెప్పారు. నిజంగానే అయోధ్య రామిరెడ్డి అనుకున్నట్టే కేసులు పడి రామ్ కీ షేర్స్ రేట్ పడిపోయి ఆయనకి భారీగా నష్టాలు వచ్చాయట. తన వల్ల అన్నకి చేదు అనుభవం ఎదురైంది కాబట్టి అప్పటినుంచి ఆయన ఎదురే పడలేదని ఆర్కే చెప్పుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అయోధ్య రామిరెడ్డి రాజకీయాలకన్నా వ్యాపారానికే ఎక్కువ విలువ ఇచ్చినట్టు అనిపిస్తోంది.
అయితే అనూహ్యంగా 2018 అక్టోబర్ లోనే సార్వత్రిక ఎన్నికలు రావొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో హఠాత్తుగా రాజకీయ నేతల మధ్య కనిపించారు అయోధ్య రామిరెడ్డి. పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కావటి శివనాగ మనోహరనాయుడు ఇటీవల కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల్ని పరిచయం చేయడానికి నరసరావుపేట పార్లమెంట్ ఇన్ ఛార్జ్ అయోధ్య రామిరెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించిన రామిరెడ్డి రాజకీయ విషయాల్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఈ బిజినెస్ మ్యాన్ ఎన్నికల మాట వినగానే రాజకీయాల్లో అలెర్ట్ అయిపోయినట్టు వున్నారు.