చలికాలం అనగానే చాలామంది భయపడిపోతుంటారు. ఆ భయం వణికించే చలి వలన మాత్రమే కాకుండా, చలికాలంలో ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యల వలన కంగారు పడుతుంటారు. సహజంగానే సీజన్ మారినప్పుడు జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలు చలికాలంలో మరింత ఎక్కువ. వ్యాధినిరోధక శక్తి తక్కువున్న వారిని ఈ సమస్యలు అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. మరి ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టి, చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండేదుకు మేము అందిస్తున్న చిట్కాలలో మరో చిట్కా “అల్లం టీ”. మనం రోజు వంటల్లో విరివిగా వాడే అల్లం మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అటువంటి అల్లం ని ఏదో మసాలా కూరలకే పరిమితం చేయకుండా, నిత్యం వాడుతున్నట్లైతే ఇంకెన్నో లాభాలు చేకూరుతాయి.
అల్లం ని విరివిగా తీసుకోవడం వలన శ్వాశకోశ సంబంధిత సమస్యల నుండి సాంత్వన లభిస్తుంది. అంతేకాక చలికాలం లో ఎదురయ్యే చర్మ ఎలర్జీ సమస్యలు కూడా దరిచేరనీయకుండా, జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి సమస్యల నుండి విముక్తి ని కూడా పొందొచ్చు. ఆరోగ్యానికి ఇంత ఉపకారం చేసే అల్లం ని “అల్లం టీ” చేసుకొని రోజు తాగడం చాలా మంచిది. ఇందులో టీ పొడి వాడాల్సిన అవసరం కూడా లేదు.అల్లం టీ తయారుచేయడం చాలా సులువు. ఇందుకోసం రెండు కప్పుల నీటిలో తగినన్ని అల్లం ముక్కలు వేసి మరిగించాలి. మీరు తేయాకు టీ ని ఇష్టపడేవారైతే అందులో కాసిన్ని పాలు, కాస్త తేయాకు పొడి, పంచదార కలిపి, తక్కువ మంటపైన టీ మంచి రంగు వచ్చేవరకు వేడి చేసి, గ్లాసులో సేవించాలి. ఒకవేళ మీరు తేయాకు టీ ని త్రాగనివారైతే నీటిలో అల్లం ముక్కలను మరిగించాక, తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. చలికాలంలో ఇలా వేడి వేడి అల్లం టీ తాగుతుంటే అనారోగ్యసమస్యలు దరిచేరవు.