జగన్ గూటికి టీడీపీ ఎమ్మెల్యే…!

MLA Amanchi Krishna Mohan May Quit TDP

ఏపీలో రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో మోహరించిన ఐటీ బృందాలు ఎప్పుడు ఎవరి ఇంటి మీద దాడి చేస్తారో తెలియక నాయకులు తలలు పట్టుకు కూర్చుంటే మరో పక్క పార్టీలు మారే వారు ఎక్కువ అవుతున్నారు. ఇటు వారు అటు ,  అటు వారు ఇటు యధేచ్చగా జంపింగ్ లు చేసేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశంలో టికెట్ హామీ ఇస్తే పార్టీ సైకిలెక్కడానికి వైకాపా ఎమెల్యేలు 9 మంది సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం, కానీ ఉన్నవారికే టికెట్లు సర్దుబాటు చేయాలంటే తల పట్టుకోవలసిన పరిస్థితిలో వారిని అలా హోల్డ్ లో ఉంచారని తెలుస్తోంది. ఇక మరో పక్క జగన్ తమ వారిని కాపాడుకోవడం కంటే పార్టీలో కొత్త వారికే ప్రాదాన్యత ఇస్తున్నారు. తాజాగా చీరాల సిట్టింగ్ ఎమెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ పార్టీలో చేరటానికి రంగం సిద్ధమయ్యింది అని గట్టిగా తెలుస్తుంది.

jagan

ఈరోజు ఆయన జగన్ ను లోటస్ పాండ్ లో కలవనున్నారని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా టిడిపి అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆమంచి టిడిపికి గుడ్‌బై చెప్పబోతున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికలలో ఆయన నవోదయం పార్టీ తరపున పోటీ చేసి టిడిపి అభ్యర్ధిపై సంచలన విజయం సాధించారు. ఆ తరువాత ఆయన టిడిపిలో చేరి కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికలలో తనపై ఓడిపోయిన సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందే కాకుండా నియోజకవర్గంలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వటం, మళ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధిగా తానే పోటీ చేస్తానని సునీత చెపుతుండటం ఆమంచికి మింగుడు పడటం లేదు. దీంతో ఆయన టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కూడా కలిసినట్లు తెలుస్తుంది. పవన్‌ సామాజిక వర్గానికి చెందిన ఆమంచి జనసేనలో చేరటం లాంఛనమేనని జనసేన కార్యకర్తలు భావించారు. ఆయన అనూహ్యంగా నేడు జగన్‌ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.