మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఇలియానా హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇలియానా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలిగిన ఇలియానాకు అక్కడ ఆఫర్లు తగ్గాయి. దాంతో మరోసారి టాలీవుడ్లో తన అధృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యింది.
అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంపై శ్రీనువైట్ల మరియు రవితేజు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. వారిద్దరికి సినిమా ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రవితేజ గత చిత్రంలు టచ్ చేసి చూడు మరియు నేల టికెట్లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఈ సినిమా సక్సెస్ ఆయనకు చాలా కీలకం. ఈ చిత్రం విజయం సాధిస్తే తప్ప భవిష్యత్తులో ఆయన సినిమాల ఆఫర్లు దక్కుతాయి. ఈ సినిమా ఫలితం తారు మారు అయితే రవితేజ క్రేజ్ మరింత పడిపోయే అవకాశం ఉంది.
ఇక మరో వైపు శ్రీనువైట్ల వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు లేక అటు ఇటు చూస్తున్న సమయంలో ఈ ఆఫర్ దక్కింది. మైత్రి మూవీస్ వారు ఈయనకు పారితోషికం ఇవ్వకుండానే సినిమా చేయించుకున్నారు. పారితోషికం అస్సలు వద్దు. సినిమా ఛాన్స్ ఇస్తే చాలు, సక్సెస్ చేసుకుని లాభాల్లో వాటాను తీసుకుంటాను అంటూ శ్రీనువైట్ల నిర్మాతలకు భరోసా ఇచ్చాడట. ఈ కథ చాలా విభిన్నంగా ఉంటుందని దర్శకుడు శ్రీనువైట్ల అంటున్నాడు. మరి అంచనాలు అందుకునేలా ఈ చిత్రం ఉంటుందా అనేది చూడాలి. రేపు ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.