తెలంగాణలో శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నడుమ అమిత్ తెలంగాణలో పర్యటిస్తూ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ పర్యటనలో షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారని తెలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం అయ్యాకే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పడం ఇందుకు ఊతం ఇస్తోంది. మిషన్ 60+ లక్ష్యంగా నేతలంతా కలిసి పనిచేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జీలను నియమించడంతొ పాటు నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలవాలన్నారు. ముస్లిం రిజర్వేషన్లు సహా టీఆర్ఎస్ ఇతర నిర్ణయాలపై పోరాడాలన్నారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా శుక్రవారం హిందూ సంస్థలకు చెందిన కీలక నేతలతో సమావేశమయ్యారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం అయోధ్యలో రామజన్మభూమి, ఉమ్మడి పౌరస్మృతి, 370 ఆర్టికల్ రద్దు వంటి అంశాలపై కేంద్ర వైఖరిపై సంఘ్ పరివార్ నేతలు అడగ్గా రామమందిరం విషయంలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతున్నాయని, లోక్‌సభ ఎన్నికల నాటికి క్లారిటీ వస్తుందని అమిత్‌షా చెప్పారు. బూత్‌స్థాయి నుంచి బీజేపీ పార్టీ బలోపేతానికి పూర్తి సహకారం ఇవ్వాలని ఈ సందర్భంగా హిందూ సంస్థలను అమిత్ షా కోరారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఎలాంటి పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సన్నద్ధం కావాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ అంశం అదే విధంగా వచ్చే ఎన్నికల్లో స్వామి పరిపూర్ణానందకు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించే అంశంపై అమిత్ షా సమావేశంలో నేతల అభిప్రాయాలను అడిగారని పార్టీ వర్గాల సమాచారం.