Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్లిపోయినప్పటికీ చాలా పార్టీలు కొత్తగా వచ్చాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు గడిచిన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎన్డీఏ నుంచి పలు పార్టీలు వైదొలిగాయన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత 11 పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యులయ్యాయని తెలిపారు. తమ కూటమి పెరుగుతోందని, ఎన్డీఏ నుంచి చంద్రబాబు మాత్రమే బయటకు వెళ్లారని, ఆయన స్థానంలో బీహార్ నుంచి సీఎం నితీశ్ కుమార్ చేరారని గుర్తుచేశారు. మీడియా సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావించిన అమిత్ షా …ఆద్యంతం ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
మోడీ దేశంలో కుటుంబ, కుల రాజకీయాలకు ముగింపు పలికి అభివృద్ధి రాజకీయాలును తీసుకువచ్చారని కొనియాడారు. మోడీ అభివృద్ధి అజెండాను ప్రజలు అంగీకరించారని అమిత్ షా చెప్పుకొచ్చారు. మోడీ చేపట్టిన పలు సంస్కరణల గురించి ఆయన ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఒకే ర్యాంకు ఒకే పింఛను సమస్యను మోడీ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. అవినీతిని అడ్డుకునేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రధాని ఆ దిశగానే అడుగులు వేస్తున్నారన్నారు. అత్యంత కష్టపడి పనిచేసే ప్రధానిని బీజేపీ దేశానికిచ్చిందని, మనదేశంలోనే కాక ప్రపంచంలోనే ఆయన ప్రజాదరణ పొందిన నాయకుడని ప్రశంసించారు. రోజుకు 15-18 గంటలు పనిచేస్తుంటారని, ఈ ప్రధాని బీజేపీ వ్యక్తి అయినందుకు ఎంతో గర్విస్తున్నామని వ్యాఖ్యానించారు.
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపైనా అమిత్ షా స్పందించారు. యుద్ధాన్ని బీజేపీ చివరి అవకాశంగా భావిస్తుందన్నారు. ఎలాంటి రక్తపాతం జరగకుండా సరిహద్దులు సురక్షితంగా ఉండాలనే మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. బీజేపీ హయాంలో ఎక్కువమంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఆకాశాన్నంటుతున్న పెట్రోడీజిల్ ధరలనూ అమిత్ షా ప్రస్తావించారు. ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్లపాటు ఉన్నాయని, కానీ ఇప్పుడు మాత్రం కేవలం కొద్దిరోజులు ఇంధన ధరలు పెరిగిపోతేనే వాళ్లు విసిగిపోతున్నారా అని ప్రశ్నించారు. ఇంధన ధరల తగ్గింపు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, దీనికి దీర్ఘకాల పరిష్కారం కోసం మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని అమిత్ షా వెల్లడించారు.