తిరుపతి దగ్గరున్న రామాపురంలో ఒక ఆశ్రమానికి సంబందించిన రహస్యాలు వెలుగులోకి తెచ్చింది ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఈ రహస్య ఘటనలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం విఐపిలు మాత్రమే ఇక్కడకి రావడం ఈ ఆశ్రమం గురించి ఎవరికి తెలియకపోవటానికి ముఖ్య కారణమేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాళ్ల గుట్టల్ల మధ్య ఆశ్రమం ఒక్కటేనా లేక ఇంకేదయినా రహస్యం ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శ్రీ సిద్దేశ్వర్ తీర్థ్ బ్రహ్మర్షి ఆశ్రమంలో స్వామి గురువానంద కొంత మందిని మాత్రమే కలుస్తారు, అదికూడా రహస్యంగా. సుందరమైన పాలరాతి ఆలయం, చక్కటి అతిధి గృహాలు ఉన్న ఆశ్రమ ప్రాంగణంలోకి స్థానికులకు ప్రవేశం లేదు. ఏ సందడి లేకుండా ఎప్పుడూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న ఆశ్రమం తలుపులు ఉత్తరాది ప్రముఖుల కోసం మాత్రమే తెరుచుకుని వెంటనే మూసుకుపోతాయని సదరు చానల్ ఈ కధనంలో పేర్కొంది.
స్థానిక నాయకులే కాదు దక్షణాదికి చెందిన ఏ ప్రముఖులు ఈ ఆశ్రమాన్ని దర్శించినట్లు దాఖలాలు లేవు, అక్కడ అలాంటి ఆశ్రమం ఉందని స్థానిక నేతలలోను చాలా మందికి తెలీదు. అందులో ఉన్న స్వామికి మన తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రచారం కూడా లేదు, అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని స్వామి వారిని దర్శనానికి తిరుమలకి వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు ‘అమిత్ షా’ ఈ ఆశ్రమానికి వెళ్ళాడు, అదే సమయంలో అలిపిరి దగ్గర ‘అమిత్ షా’ కి టిడిపి కార్యకర్తలు నిరసనలు తెలిపిన సంగతి మీడియాలో హాల్ చల్ చేసింది కానీ ఆయన 45 నిమిషాల పాటు ఈ ఆశ్రమంలో గడిపిన విషయాన్ని బైటకు ఎక్కడ పొక్కలేదు. గురువానంద గురూజీ కుటీరానికి అమిత్‌షా కొడుకు, కోడలుతో కలసి వెళ్లారు. కుటీరంలోకి అమిత్‌షా కుటుంబ సభ్యులు తప్ప ఆయనతో వచ్చిన ఎవరినీ అనుమతించలేదు. అమిత్‌షా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను సైతం కుటీర ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఆపేశారు.
గురూజీతో అమిత్‌షా దాదాపు 40 నిమిషాలు గడిపారు. అమిత్‌షా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం గురూజీ వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్టు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. గురూజీ వద్దకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మంత్రులు, నాయకులు నాలుగేళ్లుగా వస్తున్నారు కానీ మన రాష్ట్ర నేతలు, ఆయన గానీ, ఆయన ఆశ్రమ విషయాలు కానీ ఎక్కడా ఏమీ తెలియవు. అమిత్‌షా లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన సమయంలో ప్రత్యేకదళం అమిత్‌షా చుట్టూ నిలిచి ఎవ్వరినీ ఆయన దగ్గరకు వెళ్ళనివ్వలేదు. ఆశ్రమం లోపల అమిత్‌షా ఉన్నంత సేపు ప్రధాన ద్వారం వద్ద కాపలాగా ఉన్న పోలీసులు బీజేపీ నేతలను కూడా లోనికి వెళ్లనివ్వలేదు. ఇదే కాక ఇంతకు ముందు కూడా కేంద్ర మంత్రులు ‘జె పి నడ్డా’, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, తదితర ప్రముఖులు ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్లారు.
తిరుపతి కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమంలో పని చేసే వారంతా ఉత్తరాది వాల్లే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గురువానంద స్వామి దర్శనం కోసం వచ్చే విఐపి భక్తులను మామిడి తోటలో ఉన్న హాల్ లో కుర్చోపెడుతారు. వారంతా 2 లేదా 3 గంటలు భజనలు చేస్తారు. భక్తులు, తన్మయులై ఉన్న సమయంలో హఠాత్తుగా స్వామి ప్రవేశిస్తారు వేదిక పై అటు ఇటు తిరిగి భక్తులను ఆశిర్వదిస్తారు. ఒక్కొక్క సారి హిందీలో ప్రసంగిస్తారు, భక్తుల్లో కొందరిని వేదిక మీదకు పిలిచి ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు, మరి కొందరికి కానుకలు సృష్టించి ఇస్తారని కూడా చెప్తున్నారు. ఇలాగే ఒకసారి ఆయన సృష్టించి ఇచ్చిన కానుక కొంత వివాదాన్ని సృష్టించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వామీజీ గురువానంద స్వామి గాల్లోంచి తీసినట్లు తీసి ఇచ్చిన ఓ నెక్లెస్ ను ఆమె భక్తితో అందుకున్నారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా అప్పట్లో వివాదాస్పదం అయింది. అంతేకాకుండా మూఢనమ్మకాలను ప్రోత్సహించారంటూ ఆమెపై కేసులు నమోదు చేయాలని విమర్శలు వెల్లువెత్తడం కూడా బీజేపీకి అప్పట్లో తలనొప్పిగా మారింది. అయితే రాష్ట్రంలో, కేంద్రంలో రెండు చోట్లా అధికారంలో ఉన్న బీజేపీ ఈ వార్తలు నేషనల్ మీడియాకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ సంఘటన 2016 లో జరిగింది.
అయితే ఇందులో కొంతమేరకు ప్రముఖ తెలుగు వార్తా చానెల్ ఆశ్రమ విషయాలని సేకరించగలిగింది. వీటితో పాటు బ్రహ్మర్షి ఆశ్రమం వెనుక రహస్య మార్గం ఒకటి ఉందని తిరుపతి నుంచి చెత్త తీసుకెళ్లే వాహనాల కోసం డంపింగ్ యార్డు వరకు తిరుపతి నగరపాలక సంస్థ ఒక రోడ్డు ఏర్పాటు చేసింది. అయితే దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుంచి ఆశ్రమం నుండి ఆ మార్గానికి ఒక మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. పలువురు రాత్రివేళల్లో ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారని కధనం. ఆశ్రమంలో గురువానంద స్వామి కుటీరం సమీపంలో ఒక సమాధి ఉంది. అయితే… అది గురువానందస్వామి తనకోసం కట్టుకున్నదని 2010లో తాను జీవసమాధి అవుతానని గతంలో ప్రకటించిన ఆయన సజీవ సమాధి చెందక పోవడంతో, సమాధి అలాగే ఉండిపోయింది. రెయిన్‌బో ఆగ్రో ఇండస్ర్టీస్ లో ఉన్నప్పుడు గురువానందస్వామి అక్కడ పనిచేసే ఒక కేరళ అమ్మాయితో ప్రేమలో పడి కొంతకాలం ఆమెతో సహజీవనం కూడా చేసినట్టు తెలుస్తోంది.
అయితే బహ్మర్షి గురువానంద గురూజీ ఓ ఆధ్యాత్మిక గురువు. ఈ ఆశ్రమం ద్వారా ఎన్నో ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అమిత్‌షా ఆశ్రమానికి వెళ్లిన సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని, అక్కడ ఎటువంటి అక్రమాలు జరగడంలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి మీడియాకి చెప్పడం కూడా ఇప్పుడు అనుమానాలకి తావిస్తోంది. ఎందుకంటే అమిత్ షా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు భాను సహా బీజేపీ నేతలు అందిరినీ మెయిన్ గెట్ వద్దనే ఆపేశారు అలాంటప్పుడు ఆశ్రమంలో అక్రమాలు జరుగుతున్నాయో ? సక్రమాలు జరుగుతున్నాయో ఆయనకీ ఎలా తెలుస్తుంది ?
ఈ ఆశ్రమం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే గతంలో నకిలీ బాబాల పేరుతో ఎన్నో అక్రమ కార్యకలాపాలు జరిగిన ఘటనల దృష్ట్యా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆశ్రమంపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది అనేది విశ్లేషకుల వాదన.