Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హాలీవుడ్ పై అమితాబ్ బచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ ప్రపంచమంతా వ్యాప్తిచెందడంతో ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు నాశనమైపోయాయని అమితాబ్ వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్, ఇటలీ ఇలా అన్నిచోట్లా హాలీవుడ్ సినిమాలు విడుదలవుతున్నాయని, సొమ్ముచేసుకుంటున్నాయని దీనివల్ల స్థానిక సినిమా పరిశ్రమలు నష్టపోతున్నాయని అమితాబ్ ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, మనం హాలీవుడ్ చిత్రాలను ఎక్కువగా ప్రోత్సహించకూడదని, అది మన చిత్రపరిశ్రమను నాశనం చేసిందని అమితాబ్ ఆరోపించారు. హాలీవుడ్ కు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నామని చెప్పారు.
హాలీవుడ్ లో డబ్బు, అనుభవం, క్వాలిటీ, క్వాంటిటీ ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్ విభిన్న కథాంశాలతో సినిమాలు తీసుకురావాలని అమితాబ్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరంగా బాలీవుడ్ హాలీవుడ్ కు సరిపోదని, కానీ ఇప్పుడు వస్తున్న యువదర్శకులు, నిర్మాతలు హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీస్తారని నాకు అనిపిస్తోందని అమితాబ్ చెప్పారు. తాను ప్రధాన పాత్రలో నటించిన 102 నాటౌట్ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 102 నాటౌట్ చిత్రంలో అమితాబ్, రిషికపూర్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు.