Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే శక్తి, ఎన్నికలు వ్యూహాలని రచించడంలో ఆయన దిట్ట అని లోక్ సభ ఎన్నికలు అయ్యీఅవగానే అప్పటిదాకా అధ్యక్షుడిగా ఉన్న రాజ్ నాద్ సింగ్ చేత రాజీనామా చేయించి మరీ అమిత్ షా ని జాతీయ అధ్యక్షుడిని చేశారు. అయితే ఇదంతా అప్పటి పరిస్థితి ఇప్పుడు అంతా తారుమారు అయ్యేలా కనిపిస్తోంది. ఒకప్పుడు వ్యూహాలు రచించడంలో దిట్టయిన షా ఇప్పుడు అయోమయంలో పడ్డట్టు కనిపిస్తున్నారు, ఎంతగా అంటే ఏమి మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడేసి ప్రతిపక్షాలకి, విపక్షాలకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికే ఒక పక్క తన కొడుకు జయ్ షా మీద అవినీతి ఆరోపణలు, మరో పక్క తన మీద జస్టిస్ లోయా హత్య కేసు ఆరోపణలు ఇవన్ని చుట్టుముట్టాయి. తనను నేరుగా విమర్శించినా అమిత్ షా వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. పోనీ తిప్పికొట్టే సంగతి పక్కన పెడితే ఈ మధ్య ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు. ఒత్తిడిలో ఒకటి మాట్లాడాల్సింది మరొకటి మరొకటి మాట్లాడేసి విపక్షాలకు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. కర్నాటక ఎన్నికలు దగ్గరకి వస్తున్న వేళ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఆయుధంగా మారాయి.
కన్నడ ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు పోటా పోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కానీ అమిత్ షా తమ స్టార్ క్యాంపెయినర్ అని కాంగ్రెస్ అంటోంది. అదేంటి కాంగ్రెస్‌కు షా ప్రచాకర్త కావడం ఏంటని షాకవుతున్నారా. నిజమే ఈ విషయాన్ని ఆ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ లోనే ప్రకటించారు. ఇంతకీ అసలు సంగతేంటంటే… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలతో జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ను విమర్శించబోయి ఇప్పటికే రెండు మూడుసార్లు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తాజాగా ఆయన మరోసారి నోరుజారారు అంటే మరోసారి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రశంసించేలా వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. సిల్క్ ఉత్పత్తిలో దేశంలోనే కర్ణాటక అగ్రస్థానంలో ఉందని కొనియాడారు. ఈ వ్యాఖ్యల్ని అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్… అమిత్ షా చాలా మంచి పని చేశావంటూ కర్ణాటక కాంగ్రెస్ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. మరోసారి నిజాలు మాట్లాడిన అమిత్ షాకు ధన్యవాదాలు. మీరు మా స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారని ఓ వీడియోను పోస్ట్ చేశారు. 2016-17 సంవత్సరంలో కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది’ అని కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అంటే కాంగ్రెస్ చెప్పాల్సిన మాటలను బీజేపీ అధినేత చెప్పడం అనుకోకుండా ఆయన మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు కాంగ్రెస్ కు బలం చేకూర్చేలా ఉన్నాయి.
ఇంతకముందు కూడా ఓ ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా… సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిమయం అనబోయి.. యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అన్నారు. అప్పుడు పాపం పక్కనే ఉన్న యద్యురప్ప మోహంలో రక్తం చుక్క లేదంటే నమ్మండి. ఆ తర్వాత మరో నేత సాయంతో తన పొరబాటును సరిదిద్దుకున్నారనుకోండి కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అంతే కాక అమిత్ షా హిందీ లో చెప్పే ప్రసంగాన్ని కన్నడలో ట్రాన్స్‌లేట్ చేసే సమయంలో మరో పొరబాటు జరిగింది. హిందీలో షా అన్న వ్యాఖ్యలను బీజేపీ నేత కన్నడలోకి అనువదిస్తూ… ప్రధానమంత్రి దేశాన్ని నాశనం చేశారన్నారు. ఇలా వరుస వివాదాలతో షా ఇబ్బందుల్లో పడుతున్నారు. నిన్నటికి నిన్న మరో సభలో మాట్లాడుతూ విపక్షాలు అన్నింటిని కుక్కలు, పిల్లులు, పాములు ముంగిసలతో పోల్చారు. ఇప్పటికే నల్లదనం వెనక్కి తేకపోవడం, ఇక్కడనుండి డబ్బు దోచేసి వెళ్లిన మాల్యా, నీరవ్ మోడీ ల వంటి వారిని వెనక్కి రప్పించ లేకోపోవడం వంటి అనేక సమస్యల వల్ల బీజేపీ మీద ప్రజల్లోకి చాలా వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకత తగ్గించాల్సిన వ్యక్తులే ఇలా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏమయిపోతుందో మరి !