బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాల్లో నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా.. ఎస్సీ రిజర్వుడు, కొన్ని చోట్ల బీసీ నాయకుల నియోజకవర్గాల్లోనూ వైకాపా సమన్వయకర్తలను మార్చారు. రాష్ట్రంలోని మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పునకు వైకాపా నాయకత్వం రంగం సిద్ధం చేసింది. పెత్తందార్ల పెత్తనం కోసం చేస్తున్న ఈ మార్పుల్లో బడుగు, బలహీనవర్గాల నాయకులే సమిధలవుతున్నారు. సోమవారం 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మారిస్తే అందులో అయిదుగురు దళితులు, ముగ్గురు బీసీలున్నారు. మంత్రి సురేష్‌కు ఇప్పుడు మార్చిన నియోజవకర్గం మూడోది. దాదాపు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. అంటే దళితులు నాయకులుగా ఎదగకూడదా..? వారికంటూ ఒక నియోజకవర్గం స్థిరంగా ఉండకూడదా..? ఎస్సీ నాయకుల నియోజకవర్గాలను ఇలా మార్చేస్తున్న జగన్.. నా ఎస్సీలు అంటూ మాట్లాడటంలో అర్థం ఉందా?
దళితులు ఎదగకూడదా?
మంత్రి ఆదిమూలపు సురేష్‌ను 2014లో సంతనూతలపాడు, 2019లో యర్రగొండపాలెం నుంచి బరిలో దించారు. యర్రగొండపాలెం ఆయన సొం త నియోజకవర్గం . ఇప్పు డు మంత్రి కూడా కావడంతో అక్కడ నిలదొక్కునేందుకు అవకాశం దక్కింది. కానీ ఆయన్ను కొండపికి మార్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లా దాటిం చేస్తారేమో అని సురేష్ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. 2019లో గెలిచిన సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు సొంత జిల్లా గుంటూరు. ఆయన్ను ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన నేతలే వ్యతిరేకిస్తున్నారు.
వారికిందే ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు
ఎస్సీల చేతుల్లో లేవు. అగ్రవర్ణాలు.. అందులోనూ రాయలసీమలో అయితే సీఎం సామాజికవర్గ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. వారు చెప్పినవారికే అభ్యర్థిత్వం దక్కుతుంది. ఒకవేళ గెలిచినా, అధికారం వారి చేతుల్లో ఉండదు. ఆ పెత్తందార్లు చెప్పినట్లుగా పనిచేయాల్సిందే. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన బద్వేలులో డీసీ గోవిందరెడ్డి, నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కోడుమూరులో కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, శింగనమలలో ప్రస్తుత ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి పెత్తనం సాగుతోంది. సత్యవేడు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదుపులో ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండ పాలెం , సంతనూతలపాడు, కొండపి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిల చేతుల్లోనే ఉంటున్నాయి. ఉత్తరాంధ్రలో రాజాం (ఎస్సీ), పాలకొం డ(ఎస్టీ) సీట్లు రెండూ శాసనమండలిలో ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ చేతిలో ఉన్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గూడూరు పరిస్థితి మరీ దారుణం . ఈ నియోజకవర్గం పై పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కుమారస్వామి రెడ్డి, శివకుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ఆధిపత్యమే ఉంటోంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌ను ఈ సారి అక్కడ కొనసాగించే అవకాశం లేదంటున్నారు.
స్థానచలనం బడుగు మంత్రులకేనా?
ఈసారి ఎస్సీ మంత్రులైన సురేష్, మేరుగు నాగార్జునను మార్చారు. మిగిలిన మంత్రులనూ కొనసాగిస్తారనే పరిస్థితి లేదు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి(గంగాధర నెల్లూరు)ను మార్చాలని స్థానికంగా ఉన్న వైకాపాలోని ప్రధాన సామాజికవర్గ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. ఆయన్ను వ్యతిరేకిస్తున్న ముఖ్యనేత ఒకరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడు. హోం మంత్రి తానేటి వనితను గోపాలపురానికి మారుస్తారనే ప్రచారం ఉంది. మరో మంత్రి పినిపె విశ్వరూప్‌ను ఎంపీగా పోటీకి పంపే అవకాశం ఉందంటున్నారు. ప్రతి ఎన్నికల్లో స్థానచలనం ఎస్సీ లకేనా..? సర్వేలన్నీ ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే వ్యతిరేకత ఉన్నట్లు చెబుతున్నాయా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతల నియోజకవర్గాల్లో అంతా బాగుందని చెబుతున్నాయా? సర్వేల ఆధారంగానే మార్పులు చేస్తే అవి ఎస్సీ, బీసీలకే ఎందుకు పరిమితమవుతున్నాయి?
సుచరితకు అగ్ని పరీక్ష
హోం మంత్రిగా చేసిన మేకతోటి సుచరితను ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి అమరావతి రాజధాని పరిధిలోని తాడికొండకు మార్చారు. రాజధానిలో వైకాపా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినా ఆమెను అక్క డకు పంపడమేంటి? పొమ్మనలేక పొగబెట్టడమేనా అనే చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది. ఇదే తాడికొండలో 2014లో వైకాపా అభ్యర్థిగా కత్తెర క్రిస్టినా పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీ కోసం పనిచేసేవారు. కానీ, 2019లో ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇచ్చారు. తర్వాత ఆమె పార్టీకి దూరమవడంతో మళ్లీ క్రిస్టినా కుటుంబాన్ని అక్కడకు తెచ్చారు. క్రిస్టినా భర్త సురేష్ నియోజకవర్గమంతా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ కష్టపడుతున్న సమయంలో ఇప్పుడు వారిని పక్కన పెట్టేసి సుచరితను తీసుకొచ్చారు.
బీసీలదీ అదే పరిస్థితి
బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రి విడదల రజినిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు. నియోజకవర్గంలో నిలదొక్కుకుంటున్న ఆమెను అక్కడ నుంచి మార్చేశారు. గాజువాకలో పవన్‌కల్యా ణ్ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఈసారి తన కుమారుడు దేవన్‌రెడ్డిని తీసుకొద్దామనుకున్నారు. ఆయననూ పక్కన పెట్టేయడంతో పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. జగన్‌కు మొదట్నుంచి అండగా ఉంటూ.. చివరికి అక్రమాస్తుల కేసులోనూ ఇరుక్కున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రేపల్లెలోనూ మార్చారు. ‘డోన్‌లో మంత్రి బుగ్గనపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలన్నింటిలో వస్తున్నా ఆయన్ను అక్క డే కొనసాగిస్తున్నారు. మోపిదేవిని మాత్రం పక్కనపెట్టారు. అయినవారిలోనూ పెత్తందారులకు ఒక న్యాయం, బడుగువర్గాలకో న్యాయమా’ అని మోపిదేవి వర్గం భగ్గుమంటోంది.