Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సబ్బం హరి, అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడయిన ఈయనది ముందు నుండి ప్రత్యేక శైలే. వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమానిగా పేరున్న ఈయన ముందుగా విశాఖ నగరానికి మేయర్ గా పనిచేశారు. తర్వాత ఏమయిందో ఏమో కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ కి దూరం అయ్యారో అంతే వేగంగా 2009 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ టికెట్ సాధించి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్‌ను ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ కి వీరవిదేయుడిగా భక్తుడిగా పేరు పొందిన ఆయన వైఎస్ మరణానంతరం వైఎస్ కుమారుడు జగన్‌కు మద్దతుగా నిలిచారు.
పార్టీ అయితే మారలేదు కానీ, జగన్ కి ఎంతో సన్నిహితమయిన వ్యక్తులలో ఈయన పేరు ముందు వచ్చింది. కాని జగన్ ఎప్పుడు చెప్పుకునే “తెలుగువాడి గుండె కి ఢిల్లీ గద్దె కి పోటీ” అనే అర్ధాన్ని పూర్తిగా మార్చేసే విధంగా 2014 ఎన్నికల్లో గెలిస్తే జగన్ యూపీఏకే మద్దతిస్తారని సబ్బం చేసిన వ్యాఖ్యలకి సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన వైకాపా ఆయనతో తమకు సంబంధం లేదని మా పార్టీ వ్యక్తే కాదని ప్రకటించింది. తదుపరి పరిణామాల వల్ల సొంత పార్టీ ప్రభుత్వం మీదనే అవిశ్వాస తీర్మానం ఇచ్చి సొంత పార్టీ చేతనే బహిష్కారానికి గురయ్యాడు.
తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచి ఆయాన ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున విశాఖ ఎంపీ గా నామినేషన్ వేసి మరలా చివరి నిమిషం లో భాజాపా-తెదేపా కూటమి అభ్యర్ధి హరిబాబుకి మద్దతుగా తన నామినేషన్ వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించారు. అదిగో అప్పటి నుండి రాజకీయ నిరుద్యోగిగా ఆయన కాలం గడుపుతున్నారు. అయితే గ్రేటర్ విశాఖకి మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తే చక్రం తిప్పాలని, తనకి కంచుకోట లాంటి విశాఖ లో మరలా తన ప్రాభవాన్ని నిలుపుకునేలా తన వర్గాన్ని సమాయత్తం చేశారు.
2014 ఎన్నికల సమయంలోను, ఎన్నికల తర్వాతా కూడా పలుసార్లు తెలుగుదేశం, బీజేపీలు ఆయన్ని తమ తమ పార్టీ లలోకి రమ్మని ఆహ్వానించాయి. అయితే ఇప్పుడు మరలా 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న దరిమిలా ఆయన తెలుగుదేశంలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా ఆయన అనకాపల్లి ఎంపీ టికెట్ కానీ, విశాఖ ఉత్త్తర అసెంబ్లీ టికెట్ కానీ ఇచ్చేలా చూడాలని తెలుగుదేశం అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది.
ఆయన తెలుగుదేశంలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే విషయానికి మరింత ఊతం ఇచ్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును సబ్బం హరి పలుమార్లు ప్రసంసల వర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని సబ్బంహరి అన్నారు. అయితే సబ్బం కోరిన అంశాలు మీద చర్చించిన చంద్రబాబు సబ్బం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరికల్లా.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.