సింహపురి సింహం, తెదేపా నేత ఆనం వివేకా కన్నుమూత

anam vivekananda reddy passes away

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజకీయనాయకుల్లోనే తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేత ఆనం వివేకా నంద రెడ్డి ఈరోజు ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయసు 67 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆనం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు తొలుత నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. తర్వాత వైద్యుల సూచనల మేరకు కిమ్స్ లో నెల రోజుల క్రితమే ఎడ్మిట్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సిఎం చంద్రబాబు తెలుగుదేశం మంత్రులతో కలిసి ఆయన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం విషమించినట్టు రెండు రోజుల కిందటే వైద్యులు ప్రకటించారు. ఆయణ్ని బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు.

1950, డిసెంబర్‌ 25న జన్మించిన వివేకా మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా, చైర్మన్‌గా అలాగే చైర్మన్ల సంఘం ఏపీ అధ్యక్షుగా పనిచేశారు. ప్రతీనిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీరుస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయిన ఆనం ఇక లేరనే విషయాన్ని నెల్లూరు జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1999, 2004 , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆనం వివేకా, తరఫున 2014 ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీ చేరారు.

ఆనంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చిన్న కుమారుడు మయూర్ ప్రస్తుతం కార్పొరేటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు వివేకా మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. సీఎం చంద్రబాబు సైతం తన సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆనం వివేకా భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. రేపు ఆనం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.