డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన సినిమా ‘యానిమల్’. గత కొద్ది రోజులుగా పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న సందీప్.. హిందీలో తెరకెక్కించిన రెండో సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. తండ్రి కొడుకుల అనుబంధం.. ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం లో రణబీర్ తండ్రిగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు సందీప్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పటికే ఫస్ట్ షో, ప్రీమియర్ చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. ఇంతకీ రణబీర్, రష్మికల సినిమా పై నెటిజన్స్ కామెంట్స్ ఏంటో తెలుసుకుందామా.
యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ వంగా మార్క్ లోనే ఉందని.. అన్ని అంచనాలను మించేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా ఉందని.. ఫస్ట్ 15 నిమిషాలు అస్సలు మిస్ అవ్వొద్దని.. సినిమా అదిరిపోయిందంటూ కామెంట్ చేశాడు ఒక నెటిజన్.
అలాగే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ది బెస్ట్ సినిమా ఇదే అని.. ఇందులో రణబీర్ కపూర్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఇందులో వయలెన్స్ గురించి చెప్పక్కర్లేదు. మూడు గంటలు ఎక్కడా బోరింగ్ రాకుండా తీశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు .