ఆంధ్రప్రదేశ్ సిగలో మరో కీలక ప్రాజెక్టు మెరవనుంది. సోలార్ బ్యాటరీ తయారీలో అగ్రగామిగా పేరు గాంచిన ‘ట్రైటన్ సోలార్’ ఏపీలో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.727 కోట్లతో సోలార్ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది.
అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ట్రైటన్ కంపెనీ ప్రతినిధులు, ఏపీ పరిశ్రమల శాఖ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ప్లాంటు ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరమని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దశలవారీగా పెట్టుబడులు పెడతామని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ సోలార్ బ్యాటరీల తయారీకి నానో టెక్నాలజీ ‘లిథియం పాలిమర్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇదే కాక దేశీయంగా రిసార్టులు ఏర్పాటు చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.