చిక్కుల్లో కోడెల…ఈసారి పెద్ద కేసు

another case on kodela

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ మీద మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయన స్టార్ టీవీ ప్రసారాలను పైరసీ చేసి ‘కె ఛానల్’ నిర్వహిస్తున్నట్లు బ్రాడ్ క్యాస్టింగ్ అధికారులు గుర్తించారు. గౌతమ్ కమ్యూనికేషన్ పేరిట ఈ ఛానల్ ను నిర్వహిస్తున్నారని గుర్తించారు. డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడుతున్న శివరాం, ప్రతినెలా లక్షల రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారని ఈ విషయమై గతంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా తండ్రి అధికారంలో ఉండడంతో పట్టించుకోలేదనీ, దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీంతో కోర్టు అడ్వొకేట్ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిషన్ రాజాగారి కోట ప్రాంతంలో కోడెల ఇంట్లో నిర్వహిస్తున్న ‘కె ఛానల్’ ఆఫీసుపై ఏప్రిల్ 18న దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సాంకేతిక చౌర్యానికి వాడుతున్న డీకోడర్, ఎన్ కోడర్ లను స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఈ వివరాలను కమిషన్ కోర్టుకు సమర్పించింది. కాగా, ఈ వ్యవహారంలో కోర్టు సమన్లను ఇచ్చేందుకు నిన్న కోడెల ఇంటికి వెళ్లగా అక్కడి సిబ్బంది నిరాకరించారని స్టార్ టీవీ ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద కోడెల శివరామ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ న్యాయస్థానానికి నివేదిక అందజేస్తుందని పేర్కొన్నారు.