ఘాజీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తాజాగా వరుణ్ తేజ్‌తో అంతరిక్షం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సౌత్‌లో మొదటి స్పేస్ మూవీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు, సినిమాకు సంబంధించిన ట్రైలర్ అత్యంత ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల అంతరిక్షం మూవీపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతరిక్షం తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా భావించారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని భావించారు. కాని సినిమా ఫలితం తారు మారు అయ్యింది. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి బిజినెస్‌ను సాధించింది. అయితే సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు దారుణమైన నష్టాలు చవి చూస్తున్నారు.
అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం దాదాపుగా 21 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. సంకల్ప్ రెడ్డిపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. దానికి తోడు ఈ చిత్రానికి క్రిష్ నిర్మాత అవ్వడం వల్ల కూడా అంచనాలు పెరిగాయి. అయితే సినిమా మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. మొదటి రోజు సునాయాసంగా 5 కోట్లను రాబడుతుందని భావించిన అంతరిక్షం మూవీ మొదటి వారం రోజులు పూర్తి అయినా కూడా అయిదు కోట్లను రాబట్టలేక పోయింది. లాంగ్ రన్ లో అయిదు కోట్లకే ఈ చిత్రం ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఇంతటి దారుణమైన కలెక్షన్స్‌ను చిత్ర యూనిట్ సభ్యులు, సినీ వర్గాల వారు ఏ ఒక్కరు ఊహించలేదు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసిన వారు తీవ్ర నష్టాలతో కుదేలయ్యారు. నిర్మాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.