టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా కూడా ఇతర భాషలకు చెందిన వారే అని చెప్పక తప్పదు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రావడమే అరుదు. ఒకవేళ ఒకరు ఇద్దరు వచ్చినా కూడా వారికి స్టార్డం అనేది దక్కదు. తెలుగులో పెద్ద చిత్రాల్లో నటిస్తున్న ఏ ఒక్కరు కూడా తెలుగును సరిగా మాట్లాడలేరు. అయితే ఈమద్య హీరోయిన్స్ తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పేందుకు ఆశ పడుతున్నారు. తెలుగులో డబ్బింగ్ చెప్పడం వల్ల పాత్రకు అదనపు బలం వస్తుందనే ఉద్దేశ్యంతో హీరోయిన్స్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈమద్య కాలంలో సమంత, కీర్తి సురేష్, అను ఎమాన్యూల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న విషయం తెల్సిందే.
‘గీత గోవిందం’ చిత్రంతో హీరోయిన్గా ఆకట్టుకున్న రష్మిక మందన్నా కూడా ప్రస్తుతం నటిస్తున్న ‘దేవదాసు’ చిత్రంకు డబ్బింగ్ చెప్పుకోబోతుంది. అదే దారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈమె రామ్ హీరోగా నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ చాలా కీలకమైన పాత్రలో నటిస్తుంది. అందుకే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే బాగుంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అందుకు నిర్మాత దిల్‌రాజు కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.