Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై సెన్సార్ బోర్డు ఆగ్రహం వ్యక్తంచేసింది. పద్మావతిపై తన వాదనలు వినిపించేందుకు భన్సాలీ పార్లమెంట్ ప్యానెల్ ఎదుట హాజరయ్యారు. సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషీ కూడా ప్యానెల్ కు వెళ్లారు. సమావేశంలో భాగంగా జోషి, ప్యానెల్ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ పద్మావతి గురించి మాట్లాడుతూ భన్సాలీ వైఖరిపై మండిపడ్డారు. సినిమా సెన్సార్ కు రాకముందే మీడియా వర్గాలకు ఎందుకు చూపించారని మండిపడ్డారు. భన్సాలీ సెన్సార్ బోర్డును అవమానించారని జోషి ఆరోపించారు. దీనిపై భన్సాలీ వివరణ ఇచ్చారు. సినిమాలో తప్పుడు సన్నివేశాలు లేవని నిరూపించుకోడానికి తనకు వేరే మార్గం దొరకలేదని, అందుకే స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశానని తెలిపారు. పద్మావతిపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనల వల్ల ఇప్పటికే తాను చాలా నష్టపోయానని ప్యానెల్ ఎదుట భన్సాలీ ఆవేదన వ్యక్తంచేశారు.
అయితే భన్సాలీ వాదనను ప్యానెల్ తోసిపుచ్చింది. ఇలాంటి ఎమోషనల్ ఇష్యూతో సొమ్ముచేసుకోవాలని భన్సాలీ భావిస్తున్నారని ప్యానెల్ ఆరోపించింది. ఫిక్షనల్ పాత్రల నేపథ్యంతో సినిమా తెరకెక్కించినప్పుడు అసలు పేర్లు వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. మరోవైపు అనేక రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు, ఇతర బీజేపీ నేతలు పద్మావతిపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తుంటే… ఆ పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీ మాత్రం సినిమాకు పూర్తి మద్దతు ప్రకటించారు. పద్మావతి వివాదంలో ఇప్పటికే చాలా మంది కలుగజేసుకున్నారని, ఇక ప్యానెల్ జోక్యం అవసరం లేదని అద్వానీ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ముందుగా అనుకున్న ప్రకారం పద్మావతి ఇవాళ విడుదల కావాల్సి ఉంది. ఆందోళనలు, సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఆలస్యం అయిన నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. అయినప్పటికీ పద్మావతిపై ఆందోళనలు చల్లారలేదు. అయితే ఆందోళనలను పట్టించుకోకుండా సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ రాగానే… సినిమా విడుదల చేయాలని భన్సాలీ భావిస్తున్నారు.