దక్షిణాదిన హీరోలతో సమానంగా ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో అనుష్క ఒకరు. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలతో ఆమె తన బాక్సాఫీస్ పవర్ చూపించింది. ఐతే భాగమతి తర్వాత ఆమె చాలానే గ్యాప్ తీసుకుంది. నిశ్శబ్దం పేరుతో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసిన అనుష్క.. జనవరి 31న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తేవాలని అనుకుంది. ఇంతకుముందే రిలీజ్ డేట్ ఖరారు చేశారు.
ఐతే విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ప్రమోషన్ల సందడి లేకపోవడంతో వాయిదా తప్పదని తేలిపోయింది. ఇందుకు కారణాలేంటన్నది అర్థం కాలేదు. కొన్నాళ్ల స్తబ్దత తర్వాత ఎట్టకేలకు నిశ్శబ్దం రిలీజ్ గురించి అప్ డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఫిబ్రవరి 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారట.
జనవరి 31న అంటే మంచి డేట్ అయ్యేది. సంక్రాంతి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి జనవరి నెలాఖర్లో రిలీజ్ చేసే సినిమాలకు మంచి ఫలితమే వస్తుంటుంది. అనుష్క సినిమా భాగమతి కూడా ఆ టైంలోనే రిలీజై మంచి ఫలితాన్నందుకుంది. సెంటిమెంటును కొనసాగిస్తూ నిశ్శబ్దం కూడా అదే టైంలో వస్తుందని అనుకున్నారంతా. కానీ ఏం జరిగిందో ఏమో.. సినిమాను ఫిబ్రవరి మూడో వారానికి వాయిదా వేసేశారు.
ఫిబ్రవరి అంటే అన్ సీజన్. మొదటి రెండు వారాలైనా ఓకే కానీ..మూడో వారం నుంచి నెలా నెలన్నర పాటు సినిమాలు సరిగా ఆడవు. విద్యార్థులంతా పరీక్షల్లో మునిగిపోతారు కాబట్టి కలెక్షన్లు మామూలు రోజుల్లో కంటే తక్కువ వస్తాయి. అలాంటి టైంలో నిశ్శబ్దం లాంటి పేరున్న సినిమాను రిలీజ్ చేయడం అంత మంచి నిర్ణయం కాదేమో. మరి ఈ ప్రతికూలతను అధిగమించి అనుష్క తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తుందేమో చూడాలి.