బాహుబలి తరవాత ఒక్క నిశ్శబ్దం మాత్రమే అనుష్క చేతిలో ఉన్న సినిమా. అదెప్పుడో పూర్తయిపోయింది. కానీ… విడుదల తేదీనే వాయిదాలు పడుతూ వస్తోంది. ఈనెల 31న ఈసినిమాని తీసుకొద్దామనుకున్నారు. ఏమైందో ఏమో… అంతలోనే మళ్లీ వాయిదా పడింది. ఆ సినిమాకి ప్రమోషన్లు కూడా ఏమీ లేవు. చేతిలో ఉన్న ఒక్క సినిమానే విడుదలకు కుస్తీ పాట్లు పడుతోందంటే… పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. తెలుగు చిత్రసీమ దాదాపుగా అనుష్కని మర్చిపోయే స్థితికి వెళ్లిపోయింది.
ఈ పరిస్థితికి అనుష్క కూడా ఓ కారణమే. తనకొచ్చిన అవకాశాల్ని లైట్ తీసుకుంది. ఫిజిక్‌పై శ్రద్ధ చూపించలేదు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలన్న కఠిన నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె చేయాల్సిన పాత్రలు మరొకరి చేతిలోకి వెళ్లిపోయాయి. తీరా ఇప్పుడు స్వీటిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నిశ్శబ్దం విడుదలై.. ఆ సినిమా హిట్టయితే, అప్పుడు మళ్లీ తన కెరీర్‌కి ఊపొస్తుందని భావిస్తోంది. కానీ ఆ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు.
పైగా నిశ్శబ్దంకి ఎలాంటి బజ్ లేదు. ఈ సినిమా విడుదల విషయంలో స్వీటీ కూడా టెన్షన్ పడుతుందని తెలుస్తోంది. ఎప్పుడూ తన సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఆలోచించని అనుష్క.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తుందని సమాచారం. ఇప్పటికీ ఈ చిత్ర నిర్మాతలకూ, అనుష్కకీ మధ్య గ్యాప్ వచ్చేసిందట. ప్రమోషన్లలో అనుష్క కనిపించే అవకాశాలూ అంతంత మాత్రమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి.