నిను వీడని నీడను నేనేలో సహజమైన నటనను కనబరిచానని ప్రశంసిస్తున్నారు. భావోద్వేగ ప్రధానంగా సాగే నా పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు అని చెప్పింది అన్యాసింగ్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం నిను వీడని నీడను నేనే. సందీప్‌కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్‌రాజు దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో అన్యాసింగ్ పాత్రికేయులతో ముచ్చటించింది.
ఢిల్లీ నా స్వస్థలం. బీఏ రాజనీతిశాస్త్రం చదివాను.నిను వీడని నీడను నేనే సినిమాతో పాటు నా పాత్రకు మంచి స్పందన లభిస్తున్నది. ప్రథమార్థంలో వినోదం, ద్వితీయార్థంలోని ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. విడుదల రోజు ఉదయం సినిమాపై నెగెటివ్ కామెంట్స్ రావడంతో నిరాశపడ్డాను. కానీ విమర్శకులతో పాటు సోషల్‌మీడియాలో చాలా మంది సినిమా బాగుందని రాసిన వార్తలు చూసి ఆ టెన్షన్ మొత్తం పోయింది. బాలీవుడ్ చిత్రం ఖైదీ బాండ్లో నా నటన చూసి సందీప్‌కిషన్ ఈ సినిమాలో అవకాశమిచ్చారు. భావోద్వేగాలతో ముడిపడిన పాత్ర కావడంతో 20 రోజుల పాటు పాత్ర కోసం ముందుగానే సన్నద్ధమయ్యాను. హారర్ సన్నివేశాల్లో ఈజీగానే నటించినా ఎమోషన్స్ పండించడం కోసం కష్టపడాల్సివచ్చింది.
హారర్ సినిమాలంటే భయం. ఆ సినిమాల్ని చూడను. వాటిలో నటించడం కూడా ఇష్టం ఉండదు. కుటుంబ విలువలతో ముడిపడిన మంచి కథ కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. థ్రిల్లర్ నా ఫేవరేట్ జోనర్. తెలుగు భాషపై అవగాహన లేకపోవడంతో చిత్రీకరణలో సందీప్‌కిషన్ చక్కటి సహకారం అందించారు. సినిమా పట్ల తనకున్న అంకితభావం నన్ను ఆకట్టుకున్నది. సినిమాపై పాజిటివ్ టాక్‌తో పాటు కొన్ని విమర్శలు వచ్చాయి. వాటిని నేను స్వీకరిస్తున్నాను. తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్లో యశ్‌రాజ్ సంస్థలోమూడు సినిమాలకు అగ్రిమెంట్ చేశాను. భాషభేదాలతో సంబంధం లేకుండా కథ, పాత్రలు నచ్చితే ఎక్కడైనా సినిమా చేస్తాను.