బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు, దేశంలో అధికారంలో ఉంటె ఏమైనా దైవాంశ సంభూతులుగా భావిస్తున్నారేమో గానీ నిన్న విజయవాడలో ఓ బీజేపీ నేత నడిరోడ్డుపై చేసిన హల్చల్ చూస్తే మాత్రం చిర్రెత్తుకు రాక మానదు. రోడ్డు పక్కన నో పార్కింగ్ లో పార్క్ చేసిన కారును పక్కకు తీయమన్నందుకు ట్రాఫిక్ పోలీసుల పై చిందులు తొక్కిన సదరు బీజేపీ నేత. దాదాపు అరగంటపాటూ రోడ్డుపై ఒక మినీ విద్వంసాన్ని సృష్టించాడు, అంతే కాక తన కారు ఆపబోయిన కానిస్టేబుల్ మీదకు కారేక్కించి ఢీకొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటపడింది. పోలీసులు వివరాల ప్రకారం శనివారం రాత్రి ఎంజీ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. సరిగ్గా పాస్‌పోర్ట్ కార్యాలయం దగ్గర ఓ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంది. ఆ కారు వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతని భావిస్తున్నందున ఆ కారుని అక్కడి నుంచి తీయాలని కారు యజమానిని పోలీసులు కోరారు. కారును పక్కకు తీయమన్నందుకు ఆ బీజేపీ నేత కోపంతో ఊగిపోయారు. ఒక ఎంపీ క్యాండిడేట్ నే కార్ తీయమంటారా అని తిట్లు లంకించుకున్నాడు.
పోలీసులు చెప్పినా ఆ నేత లెక్క చెయ్యకుండా కారును అక్కడే ఉంచడంతో పోలీసులు టోయింగ్ వాహన సాయంతో కారును తీసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ నేత ట్రాఫిక్ సీఐతో గొడవకు దిగి దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా కారును అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌పైకి ఎక్కించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి ర్యాష్‌గా కారు నడుపుకుంటూ వెళ్లిపోయారు. పాపం ఆ కానిస్టేబుల్ పక్కకు తప్పుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఇప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా కారును నిలపటమే కాకుండా కారును తీయాలని కోరిన ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సదరు బీజేపీ నేతను సూర్యారావుపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆయన పేరు లాకా వెంగళరావు యాదవ్, 2009 ఎన్నికల్లో, ఇతను విజయవాడ ఎంపీగా, బీజేపీ తరుపున పోటీ చేసాడు.