Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాచేపల్లి దారుణంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిందని తెలియగానే…ప్రభుత్వం తక్షణమే స్పందించింది. బాధితురాలికి మెరుగైన వైద్యచికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా…నిందితుణ్ని పట్టుకునేందుకు విస్తృత గాలింపు జరిపింది. దారుణానికి ఒడిగట్టిన నిందితుడు సుబ్బయ్య చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన ఈ కేసుపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారు.
దారుణం వెలుగుచూసినప్పటి నుంచి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో సుబ్బయ్య ఆత్మహత్య తరువాత…శనివారం ముఖ్యమంత్రి బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. అంతేకాకుండా…బాలిక సంరక్షణ బాధ్యతలను స్వయంగా తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఆ అమ్మాయి పైకి వచ్చేవరకు, జీవితంలో ఉన్నతమైన స్థానానికి వచ్చే వరకు చదివించే బాధ్యత, పూర్తిగా సంరక్షించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
ఆ అమ్మాయికి గార్డియన్ గా ఉండి, పూర్తిగా సంరక్షిస్తానని, బాలిక ఆశయం నెరవేరేవరకు అన్నివిధాలా సహకరిస్తానని హామీఇచ్చారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని కూడా అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే రూ.5లక్షలు ఇచ్చామని, ఇంకో రూ. 5లక్షలు బాలిక పేరుతో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని, బాధితురాలి తండ్రి వ్యవసాయం చేసుకునేందుకు రెండు ఎకరాల భూమి కొనిస్తామని, బాధితురాలికి తండ్రికి ఏదైనా ఉపాధి కావాలంటే అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం, ఇల్లు కూడా ఇప్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
చిన్నారిపై జరిగిన దారుణం చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనలు పాల్పడినవారికి అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నాగరిక ప్రపంచం సిగ్గుపడాలని, తప్పుచేసిన వ్యక్తి తప్పించుకోకుండా కఠినంగా శిక్ష పడేలా చూస్తామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. మనిషి మృగంలా బతకడానికి వీల్లేదన్నారు. ఇలాంటి ఘటనలు రాజకీయం చేయడం దుర్మార్గమని పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. దారుణ సంఘటన నేపథ్యంలో ప్రజలు కూడా చైతన్యవంతంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం ట్విట్టర్ లో కూడా ముఖ్యమంత్రి దీనిపై స్పందించారు. దాచేపల్లి అత్యాచార ఘటన సమాజానికే మాయని మచ్చ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. జీవితం చాలా విలువైందని, నైతిక విలువలు పెంచుకోవడం, నిశ్శబ్దాన్ని చేధించడం ద్వారా ఎయిడ్స్ ను నియంత్రించామని, లైంగిక వేధింపులపై కూడా నిశ్శబ్దాన్ని చేధించాల్సిన సమయం ఆసన్నమయిందని, అరాచకాలను ప్రతిఘటించాలని, ఆడవారి జోలికెళ్తే…ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేనన్న భయం కలగాలని అన్నారు.
సోమవారం జరగనున్న ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చట్టాలు కఠినంగా రూపొందిస్తున్నామని, నిందితులు ఎవరైనా సహించేది లేదని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. అటు బాధితురాలి కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఉన్నావో, కథువా అత్యాచార బాధితులకు లభించని న్యాయం తమకు 48 గంటల్లో జరిగిందన్నారు. అన్యాయం జరిగిన తమ కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు సీఎం చంద్రబాబు, అధికారులు, అండగా నిలిచారన్నారు. బాలిక బంధువులు సీఎం ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.