సుబ్బ‌య్య‌ది ఆత్మ‌హ‌త్య‌కాదు..హత్యే!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దాచేప‌ల్లి నిందితుడు సుబ్య‌య్య ఆత్మ‌హ‌త్య‌పై ఆయ‌న బంధువులు, అత్యాచార బాధితురాలి బంధువులు అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. సుబ్బ‌య్య‌ను చంపి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టి ప‌రార‌యిన సుబ్బ‌య్య ఆచూకీ కోసం పోలీసులు 17 బృందాలు ఏర్పాటుచేసి విస్తృతంగా గాలింపు చేప‌ట్టారు. కృష్ణాన‌ది ప‌రిస‌ర‌ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల‌తో కూడా పోలీసులు గాలించారు. గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతుండ‌గానే ఈ ఉద‌యం… దైద‌లోని అమ‌ర‌లింగేశ్వ‌ర ఆల‌య స‌మీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్క‌డుకు చేరుకున్న పోలీస్ యంత్రాంగం మృత‌దేహాన్ని ప‌రిశీలించి…అత్మ‌హ‌త్య చేసుకుంది సుబ్బ‌య్యేన‌ని నిర్ధారించారు.
సుబ్బ‌య్య చెట్టుకు వేలాడుతూ ఉన్న ఫొటోను విడుద‌ల‌చేశారు. ఈ ఫొటోలో సుబ్బ‌య్య కాళ్లు నేల‌ను తాకిన‌ట్టుగా ఉన్నాయ‌ని, ఆయ‌న్ను చంపేసి, ఆత్మ‌హ‌త్య అని చెబుతున్నార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.  బాధితురాలి కుటుంబ స‌భ్యులు కూడా సుబ్బ‌య్య‌ ఆత్మ‌హ‌త్య‌పై అనుమానాలు వ్య‌క్తంచేశారు. సుబ్బ‌య్య ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటే తాము న‌మ్మ‌లేక‌పోతున్నామ‌ని, పోలీసులే ఏదో చేసి,ఉరివేశార‌ని ఆరోపించారు.  సుబ్బ‌య్య భ‌య‌ప‌డి ఉరివేసుకుంటే త‌మ‌కు న్యాయం జ‌రిగిన‌ట్టా అని  ప్ర‌శ్నించారు.  అత‌ను త‌మ చేతుల్లో చావ‌లేద‌ని బాధ‌ప‌డుతున్నామ‌ని, సుబ్బ‌య్య మృత‌దేహాన్ని తీసుకెళ్లి దాచేప‌ల్లి సెంట‌ర్ లో పెట్రోల్ పోసి నిప్పంటించాల‌న్నారు.
పోస్టుమార్టం లాంటివేమీ చేయొద్ద‌ని, మ‌రొక‌రు అత్యాచారానికి పాల్ప‌డాలంటేనే భ‌య‌పడేలా సుబ్బ‌య్య మృత‌దేహాన్ని న‌డిరోడ్డుపై ద‌హ‌నం చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు చ‌నిపోయే కొన్ని గంట‌ల ముందు సుబ్బ‌య్య త‌న బంధువు ఒక‌రితో ఫోన్ లో మాట్లాడిన సంభాష‌ణ బ‌య‌టికొచ్చింది. చేసిన దారుణంపై సుబ్బ‌య్య తీవ్ర పశ్చాత్తాపంతో ఉన్న‌ట్టు ఆయ‌న మాటల్లో స్ప‌ష్ట‌మ‌యింది. ఎక్క‌డున్నావ‌ని సుబ్బ‌య్య‌ను బంధువు అడ‌గ్గా…చావుకు ద‌గ్గ‌ర‌గా ఉండాలే అని సమాధాన‌మిచ్చాడు. ఇక త‌న‌కు జీవితం లేద‌ని, ప‌దిమందికి మంచి చెప్పి స‌ర‌దాగా బ‌తికేవాడిన‌ని, అలాంటిది అనుకోకుండా త‌ప్పు జ‌రిగిపోయింద‌ని, ఇక బ‌త‌క‌కూడ‌ద‌ని సుబ్బ‌య్య అన్నాడు.
త‌న ఖ‌ర్మ‌కాలి పాపం పండింద‌ని..తాను చేసిన ప‌నివ‌ల్ల కొడుకు ప‌రువుపోయింద‌ని, త‌న కొడుకు ఎలా బ‌తుకుతాడో అర్థం కావ‌డం లేద‌ని, ఆవేద‌న వ్య‌క్తంచేశాడు. ఎంతో సౌమ్యంగా కొడుకును పెంచి పెద్ద చేశాన‌ని, చివ‌ర‌కు అత‌ని బ‌తుకును అన్యాయం చేసి వెళ్తున్నాన‌ని, పరువులేకుండా చేశాన‌ని బాధ‌ప‌డ్డాడు. ఎక్క‌డున్నావో చెబితే..తానొస్తాన‌ని, నీకేంకాద‌ని బంధువు భరోసాగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేసినా…ఏం వ‌ద్ద‌య్యా…పొద్దున్నే చూస్తే నీకు అందుబాటులో శ‌వ‌మై క‌నిపిస్తాలే…అని చెప్పి సుబ్బ‌య్య ఫోన్ పెట్టేశాడు. ఈ ఉద‌యం…దైద వ‌ద్ద ఉరివేసుకుని క‌నిపించాడు.